లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఇద్దరు మంత్రుల వివాదాస్పద నిర్ణయాలు, ఓ మంత్రి నిష్క్రియాపరత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
= రాష్ర్ట కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ హితవు
= ఏడు నెలల పాలనపై సమీక్ష
= ‘మూఢాచారం’ బిల్లుపై డిగ్గి సీరియస్
ఏకపక్ష నిర్ణయాలొద్దంటూ మండిపాటు
= సీనియర్ల సలహాలు తీసుకోవాలని ఉద్బోధ
= సమన్వయం అవసరమని స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఇద్దరు మంత్రుల వివాదాస్పద నిర్ణయాలు, ఓ మంత్రి నిష్క్రియాపరత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో సోమవారం ఆయన అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ . పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు కేజే. జార్జ్, డీకే. శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు చెల్ల కుమార శాంతారామ్ నాయక్ తదితరులు గత ఏడు నెలలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమావేశంలో సమీక్షించారు.
మూఢాచారాల నిరోధానికి తీసుకు రాదలచిన ప్రతిపాదిత బిల్లుపై దిగ్విజయ్ సింగ్ కొద్దిపాటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు మఠాధీశులు ఈ విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకు వచ్చారని చెబుతూ, దీనిపై అత్యుత్సాహాన్ని ప్రదర్శించారంటూ న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్రపై విమర్శలు చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత బిల్లు కారణంగా దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లేలా ఉందనే సమాచారం అందినందున, ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అదే విధంగా వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి 2006లో తీసుకొచ్చిన చట్టం మూలపడి ఉన్నా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి దానిని అమలు చేయాలని సంకల్పించిన ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే తీరుపై కూడా దిగ్విజయ్ అసహనం వ్యక్తం చేశారు. దీని వల్ల సామాన్యుల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నందున, దేశ్‌పాండేకు సరైన సలహాలివ్వాలని ముఖ్యమంత్రికి సూచించారు. గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ సైతం కొందరు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ, వారికి దిశా నిర్దేశం చేయకుండా స్వేచ్ఛగా వదిలి వేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు.
ప్రభుత్వానికి మంచి రహదారుల వల్ల మంచి పేరు వస్తుందని, అయితే గత ఆరు నెలలుగా కొత్తగా ఎలాంటి రోడ్డు నిర్మాణం చేపట్టలేదని మంత్రులు తన వద్ద ఫిర్యాదు చేశారని వివరించారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చకపోతే ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ గుంతల్లో పడాల్సి వస్తుందని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడినందున ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏకపక్షంగా కాకుండా పార్టీ సీనియర్ నాయకులందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలని సలహా ఇచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండి తీరాలన్నారు.