మహాభియోగ తీర్మానం !
లోకాయుక్తను తొలగించడానికి బీజేపీ, జేడీఎస్ సహా 57 మంది ఎమ్మెల్యేల సంతకాలు
బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త భాస్కర్‌రావ్‌ను వాయిదా తీర్మానం ద్వారా (మహాభియోగం) ఆ పదవి నుంచి దించడానికి విపక్షాలు తమ ప్రయత్నాలను ఉ దృతం చేశాయి. అందులో భాగంగా లోకాయుక్తను పదవి నుంచి తొలగించే విషయమై రూపొందించిన పత్రంలో శాసనభలో ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌తో సహా 57 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. శాసనసభ్యుల సంతకాలతో కూడిన ప్రతిని శాసనసభలో ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లయిన జగదీష్‌శెట్టర్, కుమారస్వామిలు స్పీకర్ కాగోడు తిమ్మప్పకు శుక్రవారమే అందజేశారు. అనంతరం వారు బెళగావిలోని సువర్ణ విధానసౌధలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. లోకాయుక్త భాస్కర్ రావు, ఆయన కొడుకు అశ్విన్‌రావుతో కలిసి అక్రమాలకు పాల్పడుతూ ఎంతో పవిత్రమైన ఆ పదవికి కళంకం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందువల్లే భా స్కర్‌రావును ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీ, జేడీఎస్‌లు నిర్ణయించుకున్నాయని స్పష్టం చేశారు. నిబంధనలను అనుసరించి మహాభియోగ తీర్మానం ద్వారా ఆయన్ను తొలగించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఏదేని వ్యక్తిని ఓ పదవి నుంచి మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించాలంటే చట్టసభలో మొదటగా నోటీసు ఇచ్చి అటుపై చర్చ జరగాల్సి ఉంటుందన్నారు. నోటీసుపై శాసనసభ సంఖ్యాబలంలో 20 శాతం మంది శాసనసభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు తాము రూపొందించిన నోటీసుపై 56 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారని తెలిపారు. ఈ నోటీసును స్పీకర్ కాగోడు తిమ్మప్పకు అందజేసినట్లు వెల్లడించారు. శాసనసభ వ్యవహారాల సలహా సమితితో సంప్రదించి ఈ నోటీసుపై చట్టసభలో చర్చించడానికి అవకాశం కల్పించనున్నట్లు స్పీకర్ కాగోడు తిమ్మప్ప భరోసా ఇచ్చారన్నారు. లోకాయుక్త ప్రతిష్టను నిలపడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా తమతో కలిసి నడవడానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శాసనసభ్యుడు ఏ.ఎస్ పాటిల్ కూడా మహాభియోగ తీర్మానానికి మద్దతు తెలుపుతూ నోటీసుపై సంతకం చేశారని తెలిపారు.