ఎం.ఎన్.రెడ్డిపై అవినీతి ఆరోపణ
ఉప లోకాయుక్తకు ఫిర్యాదు చేశానన్న ఏడీజీపీ సుశాంత్ మహాపాత్ర
సాక్షి, బెంగళూరు: లోకాయుక్త వై.భాస్కర్‌రావుపై వస్తున్న అవినీతి ఆరోపణల వేడి చల్లారక ముందే మరో ఉన్నత స్థాయి అధికారిపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలతో పాటు అధికారుల్లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. సాధారణంగా నగర పోలీస్ కమిషనర్ నియామకం సమయంలో ఆ స్థానానికి రేసులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడం షరామామూలే. అయితే ఈ సారి ఈ ఆరోపణల పర్వం మరింత ముందే మొదలైంది. ప్రస్తుత నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి త్వరలోనే ఉద్యోగోన్నతిపై వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన కర్ణాటక పోలీస్ హౌసింగ్ సొసైటీ ఏడీజీపీగా ఉన్న సమయంలో కొత్త పోలీస్ స్టేషన్‌లు, పోలీసుల క్వార్టర్స్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ హౌసింగ్ సొసైటీ ప్రస్తుత ఏడీజీపీ సుశాంత్ మహాపాత్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక శాఖకు సైతం ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో వీరెవరూ స్పందించకపోవడంతో తాను ఉప లోకాయుక్త సుభాష్ బి.ఆడికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే సుశాంత్ మహాపాత్ర చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి వెల్లడించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఏ సాక్ష్యాలతో తనపై సుశాంత్ మహాపాత్ర ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకున్న తర్వాత ఈ అంశంపై పూర్తిగా స్పందిస్తానని పేర్కొన్నారు.