- ప్రజలను శిక్షించడం సరికాదు
- స్పీకర్ కాగోడు తిమ్మప్ప
సాక్షి, బెంగళూరు: చెరువుల్లో ఆక్రమణల తొలగింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను స్పీకర్ కాగోడు తిమ్మప్ప తప్పుబట్టారు. ప్రభుత్వం తప్పులు చేస్తూ శిక్ష మాత్రం సాధారణ ప్రజలకు విధిస్తోందని విమర్శించారు. ఇంతటి బాధ్యతారాహిత్య పాలనా విధానాన్ని మునుపెన్నడూ తాను చూడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నగరంలోని చెరువు ప్రాంతాలను ప్రభుత్వ విభాగంలో ఓ భాగమైన బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) లే అవుట్‌లను చేసి ప్రజలకు విక్రయించిందన్నారు.
ఇందులో పూర్తీ బాధ్యత ప్రభుత్వానిదే అని అభిప్రాయపడ్డారు. ఈ లే అవుట్‌లను ఎప్పటికప్పుడు రెగ్యులరైజేషన్ చేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండి హఠాత్తుగా ఆక్రమణల తొలగింపు పేరుతో ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చడం తగదని అన్నారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఆ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి తప్పిస్తే వారికి ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ప్రస్తుతం ఉంటున్న డాలర్స్ కాలనీ కూడా చెరువు స్థలాన్నిలే అవుట్‌గా మార్చి గతంలో బీడీఏనే విక్రయించింది. ఈ మొత్తం ప్రక్రియ చట్టప్రకారమే జరిగింది.
అయితే ఇది అక్రమమని పేర్కొంటూ ఇక్కడి ఇళ్లను కూల్చడానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం సరికాదు. బీడీఏ లే అవుట్‌లు చేసే సమయంలో ప్రభుత్వం ఎందుకు ఊరికే కుర్చొన్నట్లు? ఇప్పుడు ఎందుకు కూల్చడానికి తొందర పడుతున్నట్లు? ఈ విషయాలన్నీ పేర్కొంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు త్వరలో లేఖ రాస్తా’ అని పేర్కొన్నారు.
చెరువు ఆక్రమణల విషయమై ఏర్పాటైన సభాసమితికి కూడా నివేదిక తొందరగా ఇమ్మని సూచిస్తున్నట్లు ఈ సందర్భంగా కాగోడు తిమ్మప్ప తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపు వల్ల ఇప్పటి వరకూ దాదాపు 180 మంది పేద, మధ్య ప్రజలు ఇళ్లను కోల్పోయి వీధిన పడ్డారని ఆయన వాపోయారు. ఆక్రమణతొలగింపు వల్ల గూడును కోల్పోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాగోడు తిమ్మప్ప స్పష్టం చేశారు.