తల్వార్ దంపతుల ఆదాయం రోజుకు 40
Published Fri, Nov 29 2013 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
ఘజియాబాద్: జంట హత్యల కేసులో జైలుపాలైన దంతవైద్య దంపతులు రాజేశ్, నూపుర్ తల్వార్‌లు డాస్నా కారాగారంలో రోజుకు రూ. 40 సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని సదరు కారాగారానికి చెందిన ఓ అధికారి గురువారం వెల్లడించారు. వాస్తవానికి కారాగారం పాలు కాకముందు వీరిరువురి ఆదాయం రోజుకు రూ. 4,000 పైమాటే. ఇదిలా ఉండగా ఇద్దరి బ్యారక్‌లు ఒకదాని పక్కన మరొకటి ఉన్నప్పటికీ ప్రతిరోజూ కలుసుకోలేకపోతున్నారు. వారానికి ఓ రోజు నలభై నిమిషాల పాటు కబుర్లు చెప్పుకుంటున్నారు. వీరిరువురినీ 11, 13 నంబర్ బ్యారక్‌లలో ఉంచిన సంగతి విదితమే. రాజేశ్ తల్వార్ 9,342 నంబరు ఖైదీ కాగా నూపుర్‌కు 9,343 నంబరును కేటాయించారు. ఈ విషయమై డాస్నా కారాగార సూపరింటెండెంట్ వీరేశ్ రాజ్‌శర్మ మాట్లాడు తూ కారాగారం ఆవరణలోని ఉద్యానవనంలో 40 నిమిషాలు మాట్లాడుకునేందుకు వారిద్దరికీ అవకాశమిచ్చామన్నారు.
వారికి కారాగార నియమనిబంధనల ప్రకారం దుస్తులు ఇచ్చామన్నారు. కాగా కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్ హత్య కేసులో దోషులుగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారించడంతో డీలాపడిపోయిన రాజేశ్, నూపుర్ తల్వార్‌లు ఆ రోజు కారాగారంలో భోజనం చేసేందుకు నిరాకరించారు. ఆ మరుసటి రోజు న్యాయస్థానం జీవితఖైదు శిక్ష విధించినప్పటికీ శాంతించారు. కాగా వీరివురిలో రాజేశ్ దంత వైద్యుడిగా పనిచేస్తూ కారాగారంలో దంతపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారికి సేవలందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఆయనకు రోజుకు రూ. 40 చెల్లిస్తారు. ఇక నూపుర్‌కు ఖైదీల పిల్లలను చదివించే బాధ్యతలను అప్పగించారు.
Advertisement
Advertisement