సంచలనాల కేసు
న్యూఢిల్లీ:తరచూ వివాదాస్పదంగా మారడం, దర్యాప్తులో వైఫల్యం, మీడియా జోక్యం తదితర అంశాల కారణంగా ఆరుషి, హేమ్రాజ్ హత్యోదంతం దేశవిదేశాల్లో చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఇంతగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్యాంలాల్ సోమవారం ప్రకటించిన తీర్పులో తల్లిదండ్రులే దోషులని ప్రకటించారు. వీరికి మంగళవారం శిక్ష ఖరారు చేస్తామని పేర్కొనడంతో పోలీసులు తల్వార్లను ఘజియాబాద్‌లోని దస్నా జైలుకు తరలించారు. తమ 14 ఏళ్ల కూతురు ఆరుషి, నౌకరు హేమ్‌రాజ్‌ను (45) ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నూపుర్ గొంతుకోసి హతమార్చారని సీబీఐ బలంగా వాదించింది. 2008, మే 16న ఈ హత్యలు జరగడం తెలిసిందే. కేసు దర్యాప్తు పోలీసుల నుంచి సీబీఐకి చేతికి వెళ్లడం,
నౌకర్ల ప్రమేయంపై వార్తలు రావడం, తరచూ కీలక మలుపులు సంభవించడంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆరుషి హేమ్రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే హతమార్చారని దర్యాప్తు అధికారులు వాదించారు. దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం కారణంగా తాము ఈ కేసులో ఇరుక్కుపోయామని తల్వార్ దంపతులు మొదటి నుంచి పేర్కొన్నారు. అయితే వీళ్లు నేరం చేసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలేవీ తమ వద్ద లేవని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆరుషి, హేమరాజ్ మరణానికి ముందు తల్వార్ దంపతులతో కనిపించారు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చామన్న సీబీఐ వాదనతో ప్రత్యేక కోర్టు ఏకీభవించింది.
ఐదేళ్ల క్రితం..
2008 మే 16 తెల్లవారుజామున ఆరుషి మృతదేహం వారి పడక గదిలోనే కనిపించింది. ఇంటి నౌకరు హేమ్రాజ్ కనిపించకపోవడంతో అతడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరునాడు హేమ్రాజ్ మృతదేహం డాబాపై కనిపించడం కేసు కీలక మలుపు తిరిగింది. అతని గొంతుపై కత్తిగాట్లు, తలపై బలమైన గాయం ఉంది. దీంతో పోలీసులు రాజేశ్ తల్వార్‌ను అరెస్టు చేశారు. ఇది పరువుహత్యగా భావిస్తున్నట్టు ప్రకటించారు. అయితే పోలీసులపై దర్యాప్తుపై తీవ్ర విమర్శలు రావడంతో, అప్పటి ముఖ్యమంత్రి మాయావతి ఈ కేసును సీబీఐకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీబీఐ మొదట రాజేశ్‌ను అరెస్టు చేసింది. తదనంతరం అతని ఉద్యోగితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసింది.
దర్యాప్తులో ఎటువంటి బలమైన సాక్ష్యాలూ లభించకపోవడంతో అందరూ బెయిల్‌పై విడుదలయ్యారు. పేలవమైన దర్యాప్తు, పలువురు జర్నలిస్టులను ఆ ఇంట్లోకి అనుమతించడంతో ఘటనాస్థలంలోని ఆధారాలు మాయమయ్యాయి. దీంతో అప్పటి సీబీఐ డెరైక్టర్ అశ్వనీకుమార్ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. తల్వార్ దంపతులే హత్యలకు కారకులని ఈ బృందం స్పష్టం చేసింది. హత్య జరిగిన 19 నెలల తరువాత అంటే ఈ నెల 12న కోర్టు విచారణ ముగిసింది. ఆరుషి తల్లిదండ్రులే దోషులని నిరూపించడానికి సీబీఐ 90 మంది సాక్షులను ప్రవేశపెట్టింది. ఊహాజనిత కారణాలతోనే సీబీఐ ఈ నిర్ధారణకు వచ్చిందని తల్వార్ దంపతులు మొదటి నుంచి వాదించారు.
కోర్టు వద్ద భారీ భద్రత
సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘజియాబాద్ కోర్టు వద్ద సోమవారం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా మీడియాను కూడా కోర్టు గదిలోకి అనుమతించలేదు.
పోరాటం కొనసాగిస్తాం:
సీబీఐ కోర్టు తీర్పు వినగానే తల్వార్ దంపతులు కోర్టు గదిలోనే విలపించారు. తాము అమాయకులమని, న్యాయపోరాటం కొనసాగిస్తామని కాసేపటికి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నూపుర్ తల్వార్ సోదరి వందన కూడా ఇదే మాట చెప్పారు. సీబీఐ దర్యాప్తు లోపభూయిష్టమని కోర్టు బయట విలేకరులకు స్పష్టం చేశారు. అబద్ధాలన్నింటినీ అల్లి సీబీఐ వాదనలను వినిపించిందని ఆరోపించారు. సీబీఐ న్యాయవాది ఆర్కే సైనీ స్పందిస్తూ ప్రాసంగిక సాక్ష్యాల ఆధారంగానే కోర్టు తల్వార్లను దోషులగా తేల్చిందన్నారు. తల్వార్ల న్యాయవాది రెబెక్కా మాట్లాడుతూ పైకోర్టులో తమకు తప్పక న్యాయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎప్పడేం జరిగింది
2008, మే 16: ఆరుషి ఇంట్లోనే ఆమె మృతదేహం కనిపించింది. గొంతు కోసి ఆమెను చంపినట్టు తేలింది. నౌకరు హేమ్‌రాజే హంతకుడని భావించారు.
మే 17: తల్వార్ భవంతి డాబాపై హేమ్రాజ్ మృతదేహం కూడా కనిపించింది.
మే 18: శస్త్రచికిత్సలకు వినియోగించే కత్తులతో హత్యలు చేశారని పోలీసుల ప్రకటన. ఇంట్లోని వారిపైనే అనుమానాలున్నాయని వెల్లడి.
మే 23: ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్ అరెస్టు
మే 31: కేసు దర్యాప్తు సీబీఐ చేతికి
జూన్ 13: తల్వార్ల కాంపౌడర్లు కృష్ణ, రాజేశ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. తల్వార్ల పొరుగింట్లో పనిచేసే విజయ్ మండల్‌ను కూడా మరో పది రోజుల తరువాత అరెస్టు చేశారు.
జూలై 12: సాక్ష్యాల లేమి కారణంగా ఘజియాబాద్ కోర్టు రాజేశ్‌కు బెయిల్ ఇచ్చింది.
జనవరి 5: తల్వార్ దంపతులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని కోర్టును సీబీఐ కోరింది.
డిసెంబర్ 29: కోర్టుకు కేసు ముగింపు నివేదిక సమర్పణ. తగిన సాక్ష్యాధారాలు లేనప్పటికీ రాజేశే ప్రధాన నిందితుడని ప్రకటన
2011, జనవరి 25: ఘజియాబాద్ కోర్టు పరిసరాల్లో రాజేశ్‌పై దాడి జరిగింది.
ఫిబ్రవరి 9: సీబీఐ ముగింపు నివేదికను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు తల్వార్ దంపతులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు కూడా తల్వార్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
2012, మార్చి 14: రాజేశ్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ వాదనలు వినిపించింది.
ఏప్రిల్ 30: నూపుర్ తల్వార్ అరెస్టు
మే 3: నూపుర్ బెయిల్‌ను సెషన్స్‌కోర్టు తిరస్కరించింది
మే 25: నిందితులపై ఘజియాబాద్ కోర్టు హత్య, సాక్ష్యాల విధ్వంసం, కుట్ర అభియోగాలు నమోదు చేసింది.
సెప్టెంబర్ 25: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూపుర్‌కు బెయిల్
2013, ఏప్రిల్: తల్వార్లే ఆరుషి, హేమ్‌రాజ్‌ను చంపారని సీబీఐ వాదించింది. హత్యకు ముందు ఆరుషి, హేమ్రాజ్ ‘అభ్యంతరకర స్థితి’ కనిపించారని కోర్టుకు తెలిపింది.
మే 3: సీబీఐ మాజీ జేడీ అరుణ్‌కుమార్ సహా 14 సాక్షుల హాజరు కోసం సమన్లు జారీ చేయాలన్న డిఫెన్స్ న్యాయవాది విజ్ఞప్తిని సీబీఐ వ్యతిరేకించింది.
మే 6: డిఫెన్స్ న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తల్వార్ దంపతుల వాంగ్మూలాల నమోదుకు ఆదేశించింది.
అక్టోబర్ 18: సీబీఐ తన వాదనలను ముగించింది. తల్వార్లు తమను తప్పుదోవ పట్టించారని కూడా తెలిపింది.
నవంబర్ 12: న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈ నెల 25కు వాయిదా వేశారు.
నవంబర్ 25: రాజేశ్, నూపుర్ తల్వార్ దోషులేనని న్యాయమూర్తి ప్రకటన. శిక్షను మంగళవారం ఖరారు చేస్తామని వెల్లడి.