ఆరుషి హత్య కేసు తీర్పు రేపే
Published Sat, Nov 23 2013 11:40 PM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
న్యూఢిల్లీ: తల్లిదండ్రులు నిందితులు కావడం, దర్యాప్తులో వైఫల్యం, మీడియా జోక్యం తదితర అంశాల కారణంగా ఆరుషి, హేమ్‌రాజ్ హత్యోదంతం దేశవిదేశాల్లో చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఇంతగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై సీబీఐ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించనుంది. తమ 14 ఏళ్ల కూతురు ఆరుషి, నౌకరు హేమ్‌రాజ్‌ను (45) ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నూపుర్ గొంతుకోసి హతమార్చారని సీబీఐ బలంగా వాదించింది. 2008, మే 16న ఈ హత్యలు జరగడం తెలిసిందే. కేసు దర్యాప్తు పోలీసుల నుంచి సీబీఐకి చేతికి వెళ్లడం, నౌకర్ల ప్రమేయంపై వార్తలు రావడం, తరచూ కీలక మలుపులు సంభవించడంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆరుషి హేమ్‌రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే హతమార్చారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం కారణంగా తాము ఈ కేసులో ఇరుక్కుపోయామని తల్వార్ దంపతులు అంటున్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటపడతానని రాజేశ్ తల్వార్ ఇటీవల చెప్పాడు.తల్వార్ దంపతులు నేరం చూసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలేవీ తమ వద్ద లేవని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆరుషి, హేమరాజ్ మరణానికి ముందు తల్వార్ దంపతులతో కనిపించారు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చామని వివరించారు. వీరికి వ్యతిరేకంగా తగినన్ని ప్రాసంగిక సాక్ష్యాలున్నాయని, దర్యాప్తును పక్కదోవ పట్టించారని కూడా ప్రాసిక్యూటర్ ఆర్కే సైనీ వాదించారు.
ఏం జరిగిందంటే..
2008 మే 16 తెల్లవారుజామున ఆరుషి మృతదేహం వారి పడక గదిలోనే కనిపించింది. ఇంటి నౌకరు హేమ్‌రాజ్ కనిపించకపోవడంతో అతడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరునాడు హేమ్‌రాజ్ మృతదేహం డాబాపై కనిపించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అతని గొంతుపై కత్తిగాట్లు, తలపై బలమైన గాయం ఉంది. దీంతో పోలీసులు తల్వార్ దంపతులు, హేమ్‌రాజ్ స్నేహితులు ఇద్దరిని అరెస్టు చేశారు. దర్యాప్తులో ఎటువంటి బలమైన సాక్ష్యాలూ లభించకపోవడంతో అందరూ బెయిల్‌పై విడుదలయ్యారు. పేలవమైన దర్యాప్తు, పలువురు జర్నలిస్టులను ఆ ఇంట్లోకి అనుమతించడంతో ఘటనాస్థలంలోని ఆధారాలు మాయమయ్యాయి. చివరికి చేసేదేమీ లేక 2010లో ఈ కేసు మూసేశారు. హంతకులెవరో తమకు తెలియాలని, ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయించాలని తల్వార్లు కోర్టును ఆశ్రయించారు.
రెండో దర్యాప్తులోనూ వీరే నిందితులుగా తేలారు. రెండు హత్యలు జరిగిన రాత్రి తామిద్దరం నిద్రపోయామని, తెల్లవారే ఈ ఘటన గురించి తెలిసిందన్న తల్వార్ల వాదన నమ్మశక్యంగా లేదని ప్రాసిక్యూషన్ వాదించింది. శస్త్రచికిత్సలకు వాడే కత్తులతోనే హత్యలు జరిగాయని తెలిపింది. తల్వార్లు డాక్టర్లు కాబట్టి వారే ఈ హత్యలు చేసి ఉంటారని స్పష్టం చేసింది. తల్వార్ న్యాయవాది మాత్రం సీబీఐ వాదనతో ఏకీభవించడం లేదు. ‘ఇద్దరు మరణించాక మిగిలింది భార్యాభర్తలు కాబట్టి వారే నిందితులను వాదించడం సరికాదు. బయటివ్యక్తి పాత్రను సీబీఐ తిరస్కరిస్తోంది. ఇది పసలేని దర్యాప్తు’ అని డిఫెన్స్ న్యాయవాది రెబెక్కా జాన్ అన్నారు.
Advertisement
Advertisement