
మధ్యంతర ఎన్నికల్లో ఇందిర ప్రభంజనం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో చీలిక తరువాత 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరా గాంధీ దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ఆవిర్భవించారు. ఇందిరా గాంధీ హవా ఢిల్లీలోని ఏడు సీట్లపై పడింది. ఏడింటికి ఏడు స్థానాలను ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ గెలుచుకుంది.
1967 లోక్‌సభ ఎన్నికల నాటికి ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్‌ల మధ్య నాయకత్వం కోసం కొనసాగిన పోరు ఆ తరువాత జరిగిన రాష్ట్రపతి ఎన్నికల నాటికి పతాకస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ ఇందిరా గాంధీ మాత్రం అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న వీవీ గిరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆత్మప్రబోధంతో ఓటు వేయాలని ఎంపీలను కోరారు.
ఈ ఎన్నికల్లో వీవీ గిరి గెలిచారు. దీంతో కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ రెండుగా చీలిపోయింది. సీనియర్ కాంగ్రెస్ నేతలు పలువురు మొరార్జీ దేశాయ్ వెంట పాత కాంగ్రెస్‌లో ఉండిపోయారు. ఇందిరా గాంధీ నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ఏర్పాటైంది. గరీబీ హటావో నినాదంతో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికల శంఖారావం పూరించారు.
ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 441 స్థానాల్లో పోటీచేయగా 342 సీట్లు గెలిచింది. పాత కాంగ్రెస్ 238 స్థానాలలో పోటీచేసి 16 సీట్లు మాత్రమే గెలుచుకుంది. రెండు కాంగ్రెస్‌ల మధ్య జరిగిన పోటీలో జన్‌సంఘ్ కూడా దెబ్బతింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలకు 64 మంది అభ్యర్థులు తలపడ్డారు. ఇందిరా గాంధీ నిలబెట్టిన అభ్యర్థులు ఆమె పేరు బలంపైనే గెలిచారు.
ఢిల్లీలోని ఏడు స్థానాలలో సికిందర్ భఖ్త్, రాజేష్ శర్మ, శాంతిదేశాయ్, పి.కె. చందాలా వంటి నేతలు పాత కాంగ్రెస్‌లో ఉండిపోయారు. బ్రహ్మ ప్రకాశ్ రాజకీ యాలకు దూరంగా ఉండిపోయారు. కొత్త కాంగ్రెస్ నిలబెట్టిన కొత్త నేతలు అన్ని స్థానాలలో గెలిచి తొలిసారి ఎంపీలయ్యారు. ఈ ఎన్నికలలో ఢిల్లీ నుంచి ఇద్దరు మహిళలు పార్లమెంటు సభ్యులయ్యారు.
సుభద్రా జోషీ చాందినీ చౌక్ నుంచి, ముకుల్ బెనర్జీ న్యూఢిల్లీ నుంచి గెలిచారు. అంతకు ముందు ఇతర చోట్ల నుంచి లోక్‌సభ ఎన్నికలలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సుభద్రా జోషీకి చాందినీ చౌక్ టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు వ్యతిరేకించినప్పటికీ ఆమె సికిందర్ భఖ్త్ వంటి సీనియర్ నేతను ఓడించి ఇందిరా ప్రభంజనాన్ని చాటిచెప్పారు. సౌత్ ఢిల్లీలో న్యాయవాది శశిభూషణ్ జన్‌సంఘ్ నేత బల్‌రాజ్ మధోక్‌ని ఓడించారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి హెచ్‌కేఎల్ భగత్ తొలిసారి ఎంపీగా గెలిచి తరువాతి రోజుల్లో ఢిల్లీలో బలమైన కాంగ్రెస్ నేతగా ఎదిగారు. సదర్ నుంచి అమర్‌నాథ్ చావ్లా, ఔటర్ ఢిల్లీ నుంచి దీలీప్ సింగ్, కరోల్ బాగ్ నుంచి టి. సోహన్‌లాల్ గెలిచారు.