క్యాన్సర్ నివారణకు జెనెటిక్ కౌన్సెలింగ్
Published Mon, Aug 5 2013 11:01 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్ కారణంగా చనిపోయారా? ఇప్పటికీ క్యాన్సర్‌తో బాధపడుతున్నవారెవరైనా ఉన్నారా? భవిష్యత్తులో మీకూ క్యాన్సర్ వస్తుందేమోననే భయం మీలో ఉందా? అయితే మీరు తప్పకుండా జెనెటిక్ కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సిందే. క్యాన్సర్ నిజానికి వంశపారంపర్యమైన వ్యాధి కాకపోయినప్పటికీ వ్యాధిగ్రస్తులతో దగ్గరి సంబంధం, ప్రత్యేకించి రక్త సంబంధం ఉన్నవారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశముందనే విషయం ఎన్నో పరిశోధనల్లో తేటతెల్లమైంది. అయితే శరీరాన్ని తొలిచేసే వరకు బయటపడని ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం వల్ల ప్రమాదం నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతూనే ఉన్నారు.
మరి ఈ వ్యాధిని ముందుగా గుర్తించడమెలా? ఎవరెవరికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది? దీనికి పరిష్కారమేంటి? తదితర విషయాలపై అవగాహన కల్పించడమేగాకుండా క్యాన్సర్ నివారణకుగాను జెనెటిక్ కౌన్సెలింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్. క్యాన్సర్ కారణంగా మృతి చెందిన, బాధపడుతున్నవారి కుటుంబ సభ్యుల్లో అందుకు కారణమైన జన్యువులను ముందుగానే గుర్తించడం ద్వారా వ్యాధి రాకుండా చేయొచ్చని, అలా గుర్తించడం జెనెటిక్ కౌన్సెలింగ్ వల్లే సాధ్యమవుతుందంటున్నారు వైద్య నిపుణులు.
సర్ గంగారాం హాస్పిటల్ ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ విషయమై పలుచోట్ల అవగాహన శిబిరాలను, సదస్సులను ఏర్పాటు చేసింది. క్యాన్సర్ వచ్చే అవకాశమున్నవారిని జెనెటిక్ కౌన్సెలింగ్‌కు వచ్చేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఒకసారి ఈ వ్యాధిబారిన పడితే తలెత్తే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో? జెనెటిక్ కౌన్సెలింగ్ ఏ విధంగా వ్యాధి రాకుండా సాయపడుతుందో తెలియజెప్పడమేకాకుండా క్యాన్సర్ నివారణకు తమవంతు కృషి చేస్తోంది. వ్యాధి సోకినవారు కూడా జెనెటిక్ కౌన్సెలింగ్‌కు హాజరు కావడం వల్ల భవిష్యత్తులో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై కూడా తెలుస్తుందంటున్నారు నిర్వాహకులు. వ్యాధి సోకనివారికి ఈ కౌన్సెలింగ్‌ను చేయడం ద్వారా వారు వ్యాధిబారిన పడకుండా చేయొచ్చని చెబుతున్నారు.
సర్ గంగారాం ఆస్పత్రిలోని జెనెటిక్ విభాగం డెరైక్టర్ డాక్టర్ ఐసీ వర్మ ఈ విషయమై మాట్లాడుతూ... ‘రొమ్ము, ఆండాశయం, కళ్లు(రెటీనోబ్లాస్టోమా), మెదడు, థైరాయిడ్, మూత్రపిండాలు, పిత్తాశయము తదితర అవయవాలకు క్యాన్సర్ సోకేందుకు కారణమయ్యే జన్యువులను జె నెటిక్ టెస్టింగ్ వల్ల తెలుసుకోవచ్చు. వ్యక్తిగతంగా పరీక్షించినప్పుడు పాజిటివ్ రిపోర్టు వస్తే క్యాన్సర్ సోకకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. అంతేకాక క్యాన్సర్ సోకిన తర్వాత సంబంధిత అవయవాలు తొలగించడం వంటివాటిని కూడా నివారించవచ్చు.
కీమో థెరపీ వంటి అత్యంత బాధాకరమైన చికిత్స జోలికి వెళ్లకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. క్యాన్సర్ సోకకుండా ఉండేలా ఎటువంటి జీవన శైలిని అవలంబించాలనే విషయమై ఓ అవగాహనకు రావొచ్చు. ఇదంతా జెనెటిక్ టెస్టింగ్‌కు వెళ్లినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంద’న్నారు. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా తాము చేపడుతున్న ఈ కార్యక్రమంలోభాగంగా సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించడం, సోకినవారి జీవిత కాలాన్ని పెంచేందుకు అవసరమైన చికిత్సను అందించడం, మమ్మోగ్రాఫ్స్, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం వంటివి కూడా చేస్తున్నామన్నారు. ఇవన్నీ అనుభవం కలిగిన, నిపుణులైన జెనెటిక్ కౌన్సెలర్ల పర్యవేక్షణలోనే జరుగుతాయని చెప్పారు.
Advertisement
Advertisement