ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాలు | In the question papers | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాలు

Published Wed, Apr 13 2016 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

In the question papers

లీకేజీలకు విరగడ
మంత్రి కిమ్మెన రత్నాకర్
ప్రశాంతంగా రసాయనశాస్త్రం మరు పరీక్ష


బెంగళూరు:  ప్రశ్నపత్రాల లీకు సమస్యకు పరిష్కారంగా వచ్చే విద్యా ఏడాది నుంచి పదోతరగతి, పీయూసీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్ ద్వారా రవాణా చేయనున్నట్లు రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ వెల్లడించారు. విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ ఈ విధంగా ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌లో రావాణా చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం రీ ఎగ్జామ్ (మరు పరీక్ష) విజయవంతంగా ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యి పరిస్థితిని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘అన్‌లైన్‌లో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలను రవాణా చేయాలంటే సదరు కేంద్రాలకు ఇంటర్‌నెట్ సదుపాయం ఖచ్చితంగా ఉండాల్సిందే. రాష్ట్రంలో అన్ని పరీక్ష కేంద్రాలకు ఇంటర్‌నెట్ సదుపాయం ఉండదు.


అటు వంటి సమయంలో ఇంటర్‌నెట్ ఉన్న పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో పరీక్షా కేంద్రాల సంఖ్య తగ్గిపోతుంది. అందుకు అనుగుణంగా విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు దూరమవుతాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే రవాణాసదుపాయం కల్పించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పెలైట్ ప్రతిపాదికన మొదట కొన్ని ప్రాంతాల్లో  ఆన్‌లైన్ విధానంలో ప్రశ్నపత్రాలను రవాణా చేసి అనంతరం ఈ విధానాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం’ అని కిమ్మెన రత్నాకర్ వివరించారు. అయితే యూనివర్శిటీతో పోలిస్తే రాష్ట్ర విద్యాశాఖ వద్ద నాణ్యమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు. అందువల్ల ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం రవాణా చేయడం ఖచ్చితమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం పరీక్షకు సంబంధించి రెండుసార్లు పరీక్ష రోజుకంటే ఒకరోజు ముందుగానే లీకయిననేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.


ప్రశ్నపత్రాన్ని కూడా మంగళవారం ఉదయం ఎంపిక చేసి అన్ని పరీక్షా కేంద్రాలకు రవాణా చేశారు. పోలీసులతో పాటు రెవెన్యూశాఖ సిబ్బంది కూడా ప్రశ్నపత్రాల రవాణాను పర్యవేక్షించారు. ఇక పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేదాజ్ఞలు జారీ చేశారు. మొత్తంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం పరీక్ష ముగియడంతో అటు విద్యాశాఖ అధికారులతో పాటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement