- రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు
- కొన్ని జిల్లాల్లో భారీగా
- బెంగళూరులో ఓ మోస్తరు
- పలు చోట్ల స్తంభించిన ట్రాఫిక్
- కోస్తా జిల్లాల్లో పెను గాలులతో వాన
- తగ్గనున్న వేసవి తాపం!
- తగ్గిన విద్యుత్ వినియోగం
- ‘కోతలు’ ఎత్తేసే యోచనలో సర్కార్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల గురువారం కూడా చెదురు మదురు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. బెంగళూరులో ఉదయం నుంచే చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. దీంతో గంటల పాటు పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించడానికి మరో నెల గడువు ఉండగానే ఈ వర్షాలు రావడంతో వేసవి తాపం నుంచి బయట పడే అవకాశం ఏర్పడింది.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడ్డాయి. శివమొగ్గ జిల్లాలో రెండు రోజులుగా మంచి వర్షాలు పడుతున్నాయి. గురువారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృత్తమై వర్షం పడింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన నేపథ్యంలో కురిసిన ఈ వానలతో ప్రజలకు సాంత్వన లభించింది. కాగా భారీ వర్షాల కారణంగా చిక్కమగళూరులో ఓ వ్యక్తి డ్రైనేజీలో పడి మరణించాడు.
చామరాజ నగరలో కూడా జడి వాన కురిసింది. మైసూరు, మండ్య, రామనగర, బెంగళూరు గ్రామీణ, చిక్కబళ్లాపురం, దావణగెరె జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కోస్తా జిల్లాల్లో పెను గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి.
విద్యుత్ కోతలపై పునరాలోచన
రాష్ర్ట వ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో గతంలో అధికారికంగా ప్రకటించిన కరెంటు కోతలను ఎత్తి వేయాలని విద్యుత్ శాఖ యోచిస్తోంది. అయితే మరో ఒకటి, రెండు రోజులు పరిస్థితిని గమనించి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. రాష్ర్టంలో పలు చోట్ల వర్షాలు పడడంతో విద్యుత్ వినియోగం తగ్గింది. ముఖ్యంగా వ్యవసాయానికి వాడకం బాగా తగ్గింది. మొత్తం విద్యుత్ వినియోగంలో 42 శాతం వ్యవసాయానికే పోతోంది. ప్రస్తుతం రోజూ 18 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. అయిప్పటికీ డిమాండ్, సరఫరా మధ్య రెండు కోట్ల యూనిట్ల అంతరం ఉంది. అయితే వానలకు తోడు రెండు రోజుల కిందట థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నిలిచిపోయిన ఉత్పత్తి పునఃప్రారంభమవడంతో విద్యుత్ కొరత ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.