జిల్లా రాజకీయాలను నాలుగున్నరేళ్లపాటు శాసించి చక్రం తిప్పిన మాజీ మంత్రి రమణ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆయన మద్దతుదారుల్లో,
తిరువళ్లూరు: జిల్లా రాజకీయాలను నాలుగున్నరేళ్లపాటు శాసించి చక్రం తిప్పిన మాజీ మంత్రి రమణ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆయన మద్దతుదారుల్లో, అన్నాడీఎంకే శ్రేణుల్లోనూ నిరాశ ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే పార్టీ కన్వీనర్‌గా నాలుగున్నర సంవత్సరాల నుంచి రమణ విధులను నిర్వహించారు. 2011సంవత్సరంలో తిరువళ్లూరు నియోజకవర్గం నుంచి రమణ అన్నాడీఎంకే తరఫున ఎమ్మెల్యే గా గెలుపొందారు. అనంతరం జయలలిత మంత్రివర్గంలో చేనేత మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనతి కాలంలోనే కీలకమైన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ మంత్రి స్థాయికి ఎదిగారు.
పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ, అప్పటి వరకు ఉన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి అన్నాడీఎంకే శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చారు. పార్టీ బలోపేతం కోసం తరచూ కార్యక్రమాలను నిర్వహించడం, నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వచ్చేవారు. తెరవెనుక రాజకీయాలు చేసి తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకేలో ట్రబుల్‌షూటర్‌గా మారారు. గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి వేణుగోపాల్ గెలుపు కోసం అంతా తానై వ్యవహరించి రాష్ట్రంలోనే అత్యధిక మోజారిటీతో విజయాన్ని అందించారు. అయితే తదనంతరం రమణపై అధిష్ఠానానికి అనేక ఫిర్యాదులు వెల్లడంతో 2014లో మంత్రి పదవితో పాటు జిల్లా కన్వీనర్ పదవిని పోగొట్టుకున్నారు.
అంతటితో రమణ శకం ముగిసిందని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసిన రమణ, తనకు అధిష్ఠానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించి జోడు పదవులను సాధించి తన సత్తాను చాటారు. అయితే రమణ తన భార్యతో ఏకాంతంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో రమణ జోడు పదవులను పోగొట్టుకున్నారు. దీంతో రమణ రెండు వారాల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.అయితే పార్టీ అధిష్ఠానం ఎన్నికల నాటికి జిల్లా శ్రేణులను ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని స్థానాలను సాధించుకోవడానికి ప్రయత్నాలను ప్రారంభించింది. రమణ లాంటి నేత ఎన్నికల వేళ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అధికార పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహం లేదు.