అంతర్జాతీయ చిత్రోత్సవాలకు క్రిమి
తమిళసినిమా : క్రిమి చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాలకు నామినేట్ అయ్యిందని ఆ చిత్ర దర్శకుడు కరుణ్‌చరణ్ వెల్లడించారు. నిర్మాతలు ఎస్.రాజేంద్రన్, ఎం.రజనీ జయరామన్, ఎల్.పృథ్వీరాజ్, కె.జయరామన్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం క్రిమి. చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు అరుణ్‌చరణ్ మాట్లాడుతూ క్రిమి చిత్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు నామినేట్ అయ్యిందన్నారు. అయితే ఆ వివరాలను గురువారం వెల్లడిస్తానని చెప్పా రు. ఇది తన తొలి చిత్రం అన్నారు. ఇందులో హీరోగా కదిర్‌ను నటింప చేయాలని అనుకోలేదని అయితే తన తల్లి చెప్పడంతో అతడిని హీరోగా ఎంపిక చేశానని అన్నారు.
ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న ఎస్కేప్ ఆర్టిస్ట్ మారన్ మాట్లాడుతూ క్రిమి చిత్రాన్ని తాను మూడుసార్లు చూశానని తెలిపారు. అయితే ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదని అన్నారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎస్ ఎ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు అరుణ్ చరణ్ తనను కలిసి చిత్రం చూడమని కోరారన్నారు. తాను అప్పుడు సగం మాత్రం చూడగలిగానని చెప్పానన్నారు. అయితే థియేటర్ లో కూర్చొన్న తరువాత మధ్యలో వెళ్లలేక పోయానని పూర్తిగా చిత్రం చూశానని ఆయన తెలిపారు. కారణం క్రిమి చిత్రం తనను అంతగా ఆకట్టుకుందని చెప్పారు.