కమలదళంలో సూపర్‌స్టార్? | Is Rajinikanth joining the BJP? | Sakshi
Sakshi News home page

కమలదళంలో సూపర్‌స్టార్?

Published Thu, Mar 31 2016 1:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Is Rajinikanth joining the BJP?

పార్లమెంటు ఎన్నికల ప్రచార సమయంలోనే దక్షిణాదిపై బలంగా దృష్టిపెట్టిన నరేంద్రమోదీ ఆ తరువాత మరింత ఎక్కువగా దృష్టి సారించారు. ఉత్తరభారతంతో సమానంగా దక్షిణాదిలో బీజేపీనీ బలోపేతం చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు అమిత్‌షా అనేకసార్లు చెన్నై రావడం, పార్టీ సభ్యత్వం మొదలుకుని అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం సాగింది.
 
 అంతేగాక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మురళీధరరావును నియమించి అమిత్‌షా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం చేపట్టే స్థాయిలో బలపడాలని బీజేపీ ఆశించింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో అత్యుత్సాహంగా సాగిన కూటమి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల వేళ చతికిలపడ్డాయి. డీఎండీకే కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన కమలనాథులు చివరకు భంగపడ్డారు. అన్ని ప్రాంతీయ పార్టీలూ కూటములను వెతుక్కుంటూ తలోదిక్కున వె ళ్లిపోగా బీజేపీ ఒంటరిగా మిగిలింది. అధికారం కాదుక దా, గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం అసాధ్యమని బీజేపీ తెలుసుకుంది.
 
 రజనీకి కమలనాథుల వల:
 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించాలని భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రాంతీయ పార్టీల పొత్తులేకుండా అసెంబ్లీ ఎన్నికలను ఢీకొనాలంటే అదనపు బలం అవసరమని వెతుకులాట ప్రారంభించింది. ప్రధాని నరేంద్రమోదీకి వ్యక్తిగతంగా సన్నిహితుడైన సూపర్‌స్టార్ రజనీ   కాంత్‌ను ప్రసన్నం చేసుకోవడం మినహా రాష్ట్ర బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు. పార్టీ ఎన్నికల ప్రచారాల్లో స్టార్ ఎట్రాక్షన్‌తోపాటు ప్రజల్లో రజనీకాంత్‌కు ఉన్న పలుకుబడిని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నాల్లో పడింది.
 
 మోదీ దూతగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధరరావు స్వయంగా కలుగజేసుకుని రజనీకాంత్‌తో చర్చలు జరిపినట్లు పార్టీ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల వేదికల్లో ముఖ్యమైన మూడు చోట్ల నుండి రజనీకాంత్ ప్రసంగించేందుకు అంగీకరించారని మురళీధరరావు అనుచవర్గం పార్టీ పేరున  బుధవారం ప్రకటన విడుదల చేసింది. అలాగే దేశంలోని వివిధ పీఠాధిపతులు, స్వాములు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది.
 
  అంతేగాక తమిళనాడులోని కర్నాటక సరిహద్దు జిల్లాల్లో అక్కడి బీజేపీ అగ్రనేతలు యడ్యూరప్ప తదితరులను ప్రచారానికి వస్తున్నట్లు తెలిపింది. ఎన్నికలు ముగిసేవరకు మురళీధరరావు తమిళనాడులోనే ఉంటారని స్పష్టం చేసింది. అయితే భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేయబోతున్నట్లు రజనీకాంత్ ప్రకటించేవరకు ఈ వార్త నమ్మశక్యంకాని నిజమే.                        

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement