
గాడి తప్పుతున్న జల్లికట్టు
న్యూఢిల్లీ: తమిళనాడు సంప్రదాయక క్రీడైన ‘జల్లికట్టు’ను అనుమతించాలంటూ అహింసాత్మకంగా ఆందోళన ప్రారంభించిన తమిళ ప్రజలు ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారం కల్పించాలంటూ హింసకు దిగుతున్నారు. తమిళనాడు ప్రజలు సోమవారం బస్సులను తగులబెట్టడంతోపాటు చెన్నై నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు. వారి ఆందోళనకు జడిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం ఆదివారం మధురై సమీపంలోని అలంగనల్లూరు వద్ద ‘జల్లికట్టు’ను ప్రారంభించలేక పోయిన విషయం తెల్సిందే.
జల్లికట్టు అనుమతికి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విజయం సాధించిన తమిళ ప్రజలు అంతటితో ఎందుకు సంతప్తి పడలేకపోతున్నారు. అహింసాత్మకంగా ఎంతో ప్రశాంత వాతావరణంలో ఆందోళన నిర్వహించిన వారెందుకు ఇప్పుడు హింసామార్గం వైపు మళ్లుతున్నారు? భవిష్యత్తులో కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకుండా ఉండేందుకు జల్లికట్టును శాశ్వతంగా అనుమతిస్తూ చట్టం తీసుకరావాలని వారు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ప్రాథమిక స్వరూపాన్ని తప్ప ఎన్నిచట్టాలనైనా, చివరకు రాజ్యాంగ సవరణలనైనా సమీక్షించేందుకు, వాటిని సరిచేయాల్సిందిగా ఆదేశించేందుకు భారత న్యాయవ్యవస్థకు అధికారం ఉంది. అలాంటప్పుడు శాశ్వత చట్టం అంటూ ఏదీ ఉండదు. శాశ్వత పరిష్కారమూ ఉండదు. ఆందోళనకారులకు ఇది ఎంతవరకు తెలుసున్న విషయాన్ని పక్కన పెడితే ‘జనవరి 26, తమిళులకు చీకటి రోజు, భారత గణతంత్య్ర దినోత్సవాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’ అన్న నినాదాల పోస్టర్లు, అక్కడక్కడ వేలుపిళ్లై ప్రభాకరన్ ఫొటోలు పట్టుకొని మెరీనా బీచ్‌లో తమిళులు ఆందోళన చేస్తుండడం గమనార్హం. దీనర్థం ఆందోళనలోకి తమిళజాతీయవాద శక్తులు ప్రవేశించినట్లు తెలుస్తోంది.
జాతీయవాద శక్తుల్లోకి ఆందోళన వెళ్లినట్లయితే తమిళనాడులో 2009, మే 17 ఉద్యమం, 2013లో జరిగిన విద్యార్థుల ఉద్యమం పునరావతమయ్యే అవకాశం ఉంది. ఆ రెండు సందర్భాల్లో బలమైన ముఖ్యమంత్రులు ఉండడం వల్ల ఆ ఉద్యమాలు సమసిపోయాయి. ఇప్పుడు పన్నీర్ సెల్వం బలమైన నాయకులు కాకపోవడం వల్ల ప్రత్యేక తమిళ ఉద్యమానికి ఇదే సరైన సమయమని తమిళ జాతీయ వాద శక్తులు భావించే అవకాశం ఉంది. హిందీ భాషకు, వేద సంస్కతికి వ్యతిరేకంగా ప్రత్యేక తమిళ ఉద్యమాలు పుట్టుకొచ్చిన విషయం తెల్సిందే. ఉత్తరాది నాయకులు ఎక్కువగా ఉన్న అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీ పార్టీలను వ్యతిరేకించే సంస్కతి తమిళ ప్రజలది. ఎందుకంటే ఉత్తరాది ప్రజలు ఆర్యులని, వారు ద్రావిడులపై దండయాత్ర చేసి దక్షిణాదిని దురాక్రమించుకున్నారన్నది వారి విశ్వాసం.
తమిళనాడు చరిత్రలో రెండోసారి దారుణ కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నందున రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతప్తి నెలకొని ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాలించినా కావేరీ జలాలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయకపోవడం పట్ల కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందీ, సంస్కతం భాషలను ప్రోత్సహించడం కూడా వారిని కన్నెర్ర చేస్తోంది. తమిళ భాషను అధికార భాషగా గుర్తించాలంటూ వారు ఎప్పటి నుంచో ఆందోళన కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళుల ఆందోళనను సామరస్యంగా పరిష్కరించలేక పోయినట్లయితే మరోసారి జాతీయవాద ఉద్యమం చెలరేగే ప్రమాదం ఉంది.
––ఓ సెక్యులరిస్ట్ కామెంట్