
ఎంపీలకు 'అమ్మ' క్లాస్
చెన్నై: లోక్ సభ, రాజ్యసభల్లో వ్యవహరించాల్సిన విధానాలపై తన ఎంపీలకు అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ప్రత్యేక క్లాస్ తీసుకున్నారు. సోమవారం సచివాలయంలో ఆమె పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి 37 మంది లోక్ సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు హాజరు అయ్యారు. ఉభయ సభల్లో తమిళనాడుకు ప్రయోజనం చేకూర్చే అంశాలను ప్రస్తావించే విధంగా ప్రత్యేకంగా వారితో చర్చించారు.
తమిళ జాలర్లపై దాడులు, పడవల స్వాధీనం, కచ్చ దీవుల స్వాధీనం... అంశాల పై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు భారీ వర్షాలు వరదలు కారణంగా తమిళనాడులో నెలకొన్న పరిస్థితులను ఉభయ సభల దృష్టికి తీసుకెళ్లడం... రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి.. నిధుల్ని పెద్ద ఎత్తున కేంద్రం నుంచి రాబట్టే విధంగా తీసుకోవల్సిన చర్యతోపాటు వారికి సూచనలు, సలహాలను ఇచ్చారు. అలాగే పార్లమెంట్ ముందుకు కేంద్రం తీసుకురాబోతున్న ముసాయిదాల గురించి చర్చించి, వాటికి ఆమోద ముద్ర వేయడమా లేదా, అందులో సవరణలకు పట్టుబట్టే రీతిలో వ్యవహరించే విధంగా వ్యూహాలు అమలు చేయాలని జయలలిత... ఎంపీలకు వివరించారు.