మునుస్వామి కుటుంబానికి రూ.కోటి సాయం
- హెడ్‌కానిస్టేబుల్ కుటుంబానికి సాయం
- కుమార్తెకు విద్యా పరంగా అండ
- అసెంబ్లీలో అమ్మ ప్రకటన
- పోలీసుల హర్షం
చెన్నై: దుండగుల దాడిలో మరణించిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ మునుస్వామి కుటుంబానికి రూ.కోటి సాయాన్ని సీఎం జె.జయలలిత ప్రకటించారు. ఆయన కుమార్తె రక్షణ ఉన్నత విద్యా ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో వీర మరణం పొందే పోలీసుల కుటుంబాల్ని ఆదుకునే విధంగా సాయం పెంపు దిశగా చట్ట సవరణకు ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు.
కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలో గత వారం దోపిడీ దొంగల్ని పట్టుకునే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ మునుస్వామి హతమయ్యారు. దుండగుల దాడిలో మరణించిన ఆయన కుటుంబానికి రూ.ఐదు లక్షలు ఆర్థిక సాయాన్ని సీఎం జె.జయలలిత ప్రకటించారు. దుండుగుల్ని త్వరితగతిన పట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
ఈ పరిస్థితుల్లో సోమవారం అసెంబ్లీలో 110 నిబంధనల మేరకు సీఎం జె.జయలలిత చేసిన ప్రకటన పోలీసు వర్గాల్లో ఆనందాన్ని నింపింది. విధి నిర్వహణలో వీరోచితంగా పోరాడి అమరులయ్యే పోలీసుల కుటుంబాల్ని ఆదుకునేందుకు తగ్గ చట్ట సవరణలకు ఆదేశాలు ఇచ్చారు. అమ్మ నిర్ణయంతో పోలీసు వర్గాల్లో, వారి కుటుంబీకుల్లో హర్షం వ్యక్తం అవుతోన్నది.
రూ. కోటి: ఉదయం అసెంబ్లీ సమావేశం కాగానే, సీఎం జె.జయలలిత ప్రత్యేక ప్రకటన చేశారు. కృష్ణగిరి జిల్లా హోసూరులో దుండగుల్ని పట్టుకునే క్రమంలో హత్యకు గురైన హెడ్‌కానిస్టేబుల్ మునుస్వామి కుటుంబాన్ని ఓదార్చే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.ఐదు లక్షలు ప్రకటించామని, ఇది ఆ కుటుంబానికి చాలదంటూ, రూ.కోటి ప్రకటించారు. ఈ మొత్తం ఆ కుటుంబానికి అందిస్తామని ఆమె చేసిన ప్రకటనతో సభలో అన్నాడీఎంకే వర్గాల కరతాళ ధ్వనులు మార్మోగాయి.
అలాగే, విధి నిర్వహణలో దుండగుల్ని పట్టుకునే క్రమంలో గానీయండి, విధి నిర్వహణ సమయంలో ఎదురయ్యే ప్రమాదం రూపంలో గానీయండి వీరోచితంగా శ్రమించి, అమరులయ్యే పోలీసుల కుటుంబాన్ని ఆదుకునేందుకు తగ్గ చర్యలు చేపట్టామని వివరించారు. ఆ మేరకు ప్రస్తుతం వారికి ఇస్తున్న ఆర్థిక సాయం పెంపునకు చట్ట సవరణలకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఇందుకు తగ్గ చర్యలను ప్రధాన కార్యదర్శి తీసుకోనున్నారని పేర్కొంటూ, హోసూరు ఘటనలో మరణించిన మునుస్వామి కుమార్తె రక్షణ ఉన్నత విద్యా భారం ప్రభుత్వం భరిస్తుందని, అందుకు తగ్గ అన్ని ఖర్చుల్ని తామే అందిస్తామని స్పష్టం చేశారు. కాగా, విధి నిర్వహణలో మరణించి హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రప్రథమంగా పరిగణించవచ్చు. అలాగే ఆర్థిక సాయం పెంపునకు ఆదేశాలు జారీ కావడంతో పోలీసు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.