
నేడు ‘అమ్మ’ జయంతి
► వాడ వాడలా సేవలు
► మార్మోగనున్న అమ్మ నామస్మరణ
► జ్ఞాపకాలతో ఒంటరిగా చిన్నమ్మ ఆవేదన
► కేడర్‌కు చెర నుంచి లేఖ
పురట్చితలైవిగా, తమిళుల హృదయాల్లో అమ్మగా చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వనిత జే జయలలిత జయంతి శుక్రవారం. భౌతికంగా అమ్మ తమ ముందు లేని సమయంలో జరుపుకుంటున్న తొలి జయంతి అన్నాడీఎంకే వర్గాలకు తీవ్ర మనో వేదనే. అందుకే సేవా కార్యక్రమాలతో ముందుకు సాగేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ప్రసంగాలు, అమ్మ జయలలిత నామస్మరణ మార్మోగే రీతిలో అన్నాడీఎంకే వర్గాలు చర్యలు తీసుకున్నాయి. ఇక, అమ్మ జ్ఞాపకాలతో ఒంటరిగా జయంతి రోజును గడపాల్సిన పరిస్థితి తనకు ఏర్పడిందని చిన్నమ్మ శశికళ ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షి, చెన్నై: ఫిబ్రవరి 24, 1948న నాటి మైసూరు రాష్ట్రం, నేటి కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా పాండవ పుర తా లుకా మేలుకోట్టె గ్రామంలో తమిళ అయ్యంగార్ కుటుంబంలో జే. జయలలిత జన్మించిన విషయం తెలిసిందే. బాల్యంలో అనేక కష్టాలను అనుభవించిన ఆమె చదువులో్లనే కాదు, కథక్, భరతనాట్యం, మోహినీ ఆట్టం, మణిపురి నాట్యంలలో ప్రావీణ్యతను సాధించి వెండి తెర మీద ఓ వెలుగు వెలిగారు. ఏ రంగంలోనైనా తనదైన ప్రత్యేకతను చాటుకునే జయలలిత, రాజకీయ గురువు ఎంజీఆర్ అడుగు జాడల్లో సాగి తమిళనాట అమ్మగా అవతరించారు. ప్రజాహిత పథకాలు, సుపరి పాలనే లక్ష్యంగా తమిళనాడు సీఎం హోదాలో ముందుకు సాగిన జయలలిత బర్త్‌డేను ప్రతి ఏటా అన్నాడీఎంకే వర్గాలు ఆనందోత్సాహాలతో జరుపుకునే వారు. అయితే, ఈ ఏడాది అమ్మ అనంత లోకాలకు చేరడంతో తొలిసారిగా జయలలిత జయంతిని జరుపుకోవాల్సిన పరిస్థితి.
జయలలిత బతికి ఉంటే, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలతో వేడుకలు జరిగేవి. అయితే, బరువెక్కిన హృదయంతో అమ్మ జయంతిని సేవా కార్యక్రమాలతో జరుపుకునేందుకు అన్నాడీఎంకే వర్గాలు సిద్ధం అయా్యయి. వాడ వాడల్లో ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు సంక్షేమ కార్యక్రమాల పంపిణీ నిమిత్తం చర్యలు తీసుకున్నారు. ఇక,వాడ వాడల్లో అమ్మ చిత్ర పటాల్ని కొలువు దీర్చి పూల మాలుల వేసి నివాళులర్పించడమే కాకుండా, ఆమె ప్రసంగాల్ని హోరెత్తించేందుకు సిద్ధం అయా్యరు. చిన్నమ్మ శశికళ నేతృత్వంలోని అన్నాడీఎంకే శిబిరం, మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని శిబిరం వర్గాలు పోటా పోటీగా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగనున్నాయి. ఇక, మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్దకు పెద్ద ఎతు్తన పార్టీ నాయకులు, మంత్రులు, కేడర్ తరలి వచ్చే అవకాశాలు ఎకు్కవే. దీంతో ఆప రిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అమ్మ జ్ఞాపకాలతో
జయలలిత జయంతిని పురస్కరించుకుని పరప్పన అగ్రహార చెర నుంచి కేడర్‌కు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ లేఖ రాశారు. అమ్మ సేవలు, పథకాలు, సుపరి పాలనను అందులో వివరించారు. అమ్మ భౌతికంగా లేకుండా జరుపుకుంటున్న ఈ జయంతి తీవ్ర మనోవేదనను కల్గిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ దూరం అవుతారని కలలో కూడా ఎవ్వరూ ఊహించ లేదని పేర్కొన్నారు. అమ్మ ఖ్యాతిని ఎలుగెత్తి చాటే విధంగా సేవా కార్యక్రమాలతో జయంతిని జరుపుకుందామని పిలుపునిచ్చారు. 33 సంవత్సరాలుగా అమ్మతో కలిసి ఆనందంగా బర్త్‌డే వేడుకను జరుపుకున్నట్టు, అయితే, ఈ సారి అమ్మ జ్ఞాపకాలతో ఒంటరిగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి హృదయంలో అమ్మ ఉన్నారని, అమ్మ పేరు మార్మోగే విధంగా, కుట్ర దారులు, వ్యతిరేకుల గుండెల్లో గుబులు రేపే విధంగా ప్రతి కార్యకర్త ఈసందర్భంలో ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.