జయ సీఎం కాబోతున్నట్లు వార్తలు రావడంతో అన్నాడీఎంకే త్యాగాలమయంగా మారింది. పార్టీ అధినేత్రి జయలలిత పోటీ చేసేందుకు తమ అసెంబ్లీ స్థానాలను త్యాగం చేసేందుకు ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ ఆదివారం ఉదయం రాజీనామా చేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆస్తుల కేసు నుంచి జయ నిర్దోషిగా బైటపడడంతో సంబరాలు చేసుకున్న పార్టీనేతలు ఇక సీఎంగా చూడాలని తహతహలాడుతున్నారు. తాజా తీర్పుపై అప్పీలు ప్రచారంతో అన్నాడీఎంకేలో నిరాశానిస్పృహలు నెలకొన్నా ఈనెల 22వ తేదీన ఎమ్మెల్యేల సమావేశం వారిలో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. అయితే ఎమ్మెల్యేల సమావేశం వరకేనా, అదేరోజు అమ్మ సీఎం అవుతారా అనే విషయంలో పార్టీలో స్పష్టత లేదు. జయ సీఎం కావడం ఖాయమని ఎమ్మెల్యేలు గట్టి నమ్మకంతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. జయ దోషిగా నిర్ధారణైనందున శ్రీరంగంలో ఉపఎన్నిక నిర్వహించినట్లు అసెంబ్లీ కార్యదర్శి అందులో పేర్కొన్నారు. తాజా తీర్పు వెలువడిన నేపథ్యంలో జయ నిర్దోషి అనే అంశాన్ని పొందుపరిచారు.
రాజీనామాల పోటీలో ‘వెట్రి’
సీఎం అయిన ఆరునెలల్లోగా ఉప ఎన్నిక ఎదుర్కొని జయ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. జయ కోసం నియోజకవర్గ స్థానాన్ని ఖాళీ చేసేందుకు పార్టీలో పోటీ మొదలైంది. జయ కేసులో తీర్పు వల్ల ఖాళీ అయిన స్థానంలో గెలుపొందిన వలర్మతి తాను తప్పుకుంటానని ప్రకటించారు. తిరుచందూరు డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ సైతం అమ్మకోసం రాజీనామా చేస్తానని ప్రకటించి సొంతపార్టీ బహిష్కరణకు గుైరయ్యారు. విజయకాంత్‌ను కాదని అమ్మ పంచన చేరిన ఎనిమిది మంది డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలకు తోడు మరో ఐదుగురు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అమ్మకోసం రాజీనామాకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గానికి (అన్నాడీఎంకే) ప్రాతినిథ్యం వహిస్తున్న వెట్రివేల్ ఆదివారం రాజీనామా చేశారు.
అయితే ఈ విషయాన్ని సాయంత్రం వరకు గోప్యంగా ఉంచారు. వెట్రివేల్ తన రాజీనామాను స్పీకర్ ధనపాల్‌కు సమర్పించగా ఆయన ఆమోదించిన సమాచారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎమ్మెల్యే రాజీనామా నిజమో విషయం వెల్లడికాక మునుపే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ తదితరులు సచివాలయంలో ఆదివారం హడావిడిగా సమావేశం కావడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని సైతం వారు స్పష్టం చేయలేదు. ఈనెల 22 లేదా 23వ తేదీలో జయ సీఎం అయిన పక్షంలో జూన్ మొదటివారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు వారు కసరత్తు చేశారని సచివాలయ సిబ్బంది సైతం దాటవేశారు. అయితే వెట్రివేల్ రాజీనామా వల్ల జయ చెన్నై నుంచే ఉప ఎన్నికల ఎదుర్కొంటారని భావించాల్సి వస్తోంది.
ఆత్మాహుతి- పాదయాత్ర
జయ నిర్దోషిగా విడుదల కావాలని కోరుతూ ఆరు నెలలపాటు సాగిన పూజలు, హోమాలను ఆమె సీఎం కావాలని కోరుతూ కొనసాగిస్తున్నారు. మదురై మీనాక్షి అమ్మన్ కోవిల్ నుంచి తిరుప్పరంగకున్రం వరకు ఆదివారం నాడు 8 కిలోమీటర్ల దూరం మంత్రి సెల్లూర్‌రాజా పాదయాత్రను నిర్వహించారు. తంజావూరు జిల్లా కుడందై సమీపం తిల్లయంపూర్‌లో రవిచంద్రన్ (55) ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అన్నాడీఎంకే పంచాయితీ కార్యదర్శి, సహకారం సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న రవిచంద్రన్ అమ్మకు వీరాభిమాని. నిర్దోషిగా తీర్పురాగానే పెద్ద ఎత్తున సంబరం జరుపుకున్నాడు.
సీఎం కావడంలో విపక్షాలు అప్పీలు పేరుతో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేయడంతో కృంగిపోయాడు. అదే దిగాలుతో శనివారం అర్ధరాత్రి ఇంటిలోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాధతో వేసిన కేకలకు భార్యాపిల్లలు లేచి మంటలు ఆర్పి ఆసుపత్రిలో చేర్పించారు. తమిళనాడుకు అమ్మ శాశ్వత సీఎం కావాలి, తన ఇద్దరు కూతుళ్లను అమ్మ ఆశీర్వదించాలి, నా శవంపై అన్నాడీఎంకే పార్టీ పతాకాన్ని కప్పి అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ ఆత్మాహుతికి ముందు రవిచంద్రన్ రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అమ్మకోసం..
Published Mon, May 18 2015 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement