
ట్రాఫిక్కా మజాకా !
అమ్మపై మళ్లీ దావా
పిటిషన్‌ను వెనక్కు పంపిన కోర్టు
సాక్షి, చెన్నై: అందరి మీద పరువు నష్టం దావాలు వేసే అన్నాడీఎంకే అధినేత్రి, అమ్మ జయలలిత మీదే దావాకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సిద్ధమయ్యారు. అయితే, ఆయన పిటిషన్‌ను కోర్టు వెనక్కు పంపడం గమనార్హం. సీఎం జయలలితకు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించినా, ఆధార రహిత ఆరోపణలు చేసినా కోర్టుల్లో పరువు నష్టం దావాలు దాఖలు కావాల్సిందే. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ న్యాయవాదులు ఉరకలు తీస్తుంటారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, దళపతి స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసులతో పాటుగా ఆ పార్టీలకు చెందిన పలువురు నేతలు, ఇంకా చెప్పాలంటే, అనేక పత్రికల సంపాదకులు, సామాజిక కార్యకర్తల మీద సైతం ఎన్నో దావాలు దాఖలై ఉన్నాయి.
అందరి మీద దావాలు వేస్తూ ముందుకు సాగుతున్న అమ్మ జయలలిత మీద తాను దావా వేస్తానంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి రంగంలోకి దిగారు. సామాజిక కార్యకర్తగా ట్రాఫిక్ రామస్వామి తమిళనాట సుపరిచితుడే. ఆయన మీద కూడా ప్రభుత్వం తరఫున దావాలు దాఖలు చేసి ఉన్నాయి. తాజాగా, తన మీద అన్నాడీఎంకే పత్రిక నమదు ఎంజీయార్‌లో వచ్చిన ఓ కథనం ఆధారంగా ఆ పార్టీ అధినేత్రి జయలలిత, సంపాదకుడిపై పరువు నష్టం దావాకు ట్రాఫిక్ కసరత్తులు చేస్తూ ఉండడం విశేషం.
గత నెల 23వ తేదీన జార్జ్ టౌన్ కోర్టులో పిటిషన్‌ను ఆయన దాఖలు చేసి ఉండటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పరువుకు భంగం కల్గించే విధంగా నమదు ఎంజీయార్‌లో కథనం వచ్చిందని, ఆ పత్రిక నిర్వాహకురాలైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, పత్రిక సంపాదకుడు పూంగుండన్‌ల మీద క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ కోర్టు పరిగణలోకి తీసుకోక పోవడం గమనార్హం. ఆ పిటిషన్‌కు తగ్గ ఆధారాలు లేవంటూ కోర్టు వెనక్కు పంపించింది.
దీంతో గత పిటిషన్ తిరస్కరణ సమయంలో కోరినట్టుగా ఆధారాలు, వివరాల్ని పొందు పరిచి బుధవారం మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇందులో ఉన్న ఆధారాలు, వివరాలు, సమాచారాలు కూడా చాలవంటూ పిటిషన్‌ను జార్జ్ టౌన్ కోర్డు న్యాయమూర్తి వెనక్కు పంపించడం గమనించాల్సిన విషయం. అయితే, పట్టు వదలని విక్రమార్కుడి లా ఎలాగైనా పరువునష్టం దావా దాఖలు చేసి తీరడం, తన కేసులో జయలలితను కోర్టు మెట్లు ఎక్కించి తీరాలన్న లక్ష్యంతో ట్రాఫిక్ రామస్వామి పరుగులు తీస్తున్నారట.