► దీపపై పెరుగుతున్న ఒత్తిడి
► సేలంలో జయలలిత దీప పేరవై
►మూడు వారాల్లోనిర్ణయం
► జయ మేనకోడలు దీప వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మలేని అన్నాడీఎంకేకు జయలలిత మేనకోడలు దీప ఆశాదీపమనే ప్రచారం ఊపందుకుంది. జిల్లా నలుమూలల నుంచి దీప ఇంటికి చేరుకుని రాజకీయ అరంగేట్రంపై ఒత్తిడి పెరుగుతోంది.
అన్నాడీఎంకేకు అన్నీతానై వ్యవహరించిన జయలలిత ఎవ్వరినీ తన వారసురాలిగా ప్రకటించకుండానే కన్నుమూశారు. జయకు అత్యంత సన్నిహితురాలిగా ఉండడమే ఏకైక అర్హతగా శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. జయలలిత మరణం వెనుక నెలకొన్న అనుమానాలు, జయ రక్తసంబంధీకురాలైన దీపను దరిచేరనీయక పోవడం శశికళ కుట్రగా అనుమానిస్తున్నారు. అన్నాడీఎంకేలోని అగ్రనేతలంతా కలిసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ద్వితీయశ్రేణీ మొదలుకుని కింది స్థాయి వరకు మండిపడుతున్నారు.
అంతటితో ఆగక సీఎం పదవిని కూడా కట్టబెట్టే ప్రయత్నాలను సహిం చలేక పోతున్నారు. శశికళ పోస్టర్లు, ఫ్లెక్సీలు చింపివేయడం ద్వారా తమ అగ్రహాన్ని బహిరంగంగా చాటుకుంటున్నారు. అన్నాడీఎంకేకు అసలైన వారసురాలు దీప మాత్రమేనని పట్టుబట్టే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. శశికళ స్థానంలో దీపను కూర్చోబెట్టాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీప పేరున గత కొంతకాలంగా పోస్టర్లు వెలిశాయి. జయలలిత మరణించే వరకు దీప అంటే ఎవరో తెలియదు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దీప గురించే చర్చ. తన బొమ్మతో పోస్టర్లు వేయరాదని దీప అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా ఆగని అభిమానగణం చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి తండోపతండాలుగా చేరుకోవడం ప్రారంభించారు. వచ్చేపోయే అభిమానులతో దీప ఇంటి పరిసరాలు నిత్యం రద్దీగా మారిపోయాయి. జయ రాజకీయ వార సురాలిగా అన్నాడీఎంకేలో చేరాలని దీపపై వత్తిడి చేస్తూ రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి ఆమె ఇంటికి వస్తున్నారు.
కడలూరు, సేలం, వేలూరు జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు మంగళ, బుధవారాల్లో దీపను కలుసుకున్నారు. ఇంటి బాల్కనీ నుండి అందరికీ అభివాదం చేస్తూ అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నమైన రెండాకుల గుర్తుగా రెండువేళ్లను చూపడంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయింది.ఈ సందర్బంగా దీప మాట్లాడుతూ, అత్త మరణం తనను కలిచి వేసిందని, ఆమె మరణంపై ఉన్న నెలకొన్ని ఉన్న అనుమానాలపై కోర్టులోని పిటిషన్ల మూలంగా త్వరలో ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ప్రధానంగా ఈ కారణం చేతనే రాజకీయాల్లోకి వచ్చే అంశంపై జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తనపై చలామణి ఉన్న వార్తలన్నీ ఊహాగానాలని అన్నారు. మరో మూడు వారాల్లో మీరు ఆశించిన నిర్ణయాన్నే ప్రకటిస్తానని దీప హామీ ఇచ్చారు. మంగళవారం చెన్నైలోని దీపను కలుసుకున్న సేలంకు చెందిన వారే బుధవారం నాడు ‘జయలలిత దీప పేరవై’ అనే అభిమాన సంఘాన్ని స్థాపించడం గమనార్హం