పులిని చూసి ఎలుక ఎగతాళి
రాందాస్ వ్యాఖ్యలపై దీప గరం
టీనగర్: అన్నాడీఎంకేపై రాందాస్ వ్యాఖ్యలు చేయడం పులిని చూసి ఎలుక ఎగతాళి చేసినట్లుంద ని ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ప్రధాన కార్యదర్శి జె. దీప విమర్శించారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలిపారు. అవినీతి రాబందులు ఊరిని మోసగించే విధంగా రెండు వర్గాల విలీనం పేరుతో నాటకాన్ని రక్తికట్టిస్తున్నాయని అన్నారు.
ప్రస్తుతం దినకరన్ అరెస్టు వ్యవహారాన్ని దారి మళ్లించేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో శశికళ బ్యానర్ల తొలగింపుతో పురట్చి తలైవర్ ఎంజీఆర్, పురట్చి తలైవి జయలలిత వర్గాల అసలైన కార్యకర్తలు మోసపోరని అన్నారు. అన్నాడీఎంకే పార్టీని, రెండాకులను రక్షించే వరకు ఎంజీఆర్ అమ్మా దీప పేరవై నిద్రపోదన్నారు. ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ గందరగోళంలో పాట్టాలి మక్కల్ కట్చి నేత రాందాస్ రెండాకుల చిహ్నాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని ప్రకటన విడుదల చేయడం గర్హనీయమన్నారు.
కోటిన్నర కార్యకర్తలు ఉన్న పార్టీపై ఈ వ్యాఖ్యలు చేయడం పులిని చూసి ఎలుక ఎగతాళి చేసినట్లుగా ఉందన్నారు. త్వరలో అసలైన అన్నాడీఎంకే కార్యకర్తలు తన నాయకత్వం కిందికి వస్తారన్నారు. అమ్మా– 2023 విజన్ పథకం స్వప్న సాకారం చేసేందుకు అహర్నిశలూ కృషిచేస్తామని పేర్కొన్నారు.