సిద్ధరామయ్యకు పుత్రశోకం
అనారోగ్యంతో బెల్జియంలో మృతిచెందిన రాకేశ్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్ద కుమారుడు రాకేశ్(39) శనివారం బెల్జియంలో అనారోగ్యంతో కన్నుమూశారు. రాకేశ్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొం తకాలంగా క్లోమ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత వారం యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో స్నేహితులు బ్రస్సెల్స్‌లోని ఆంట్వెర్ప్ వర్సిటీ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసి వెంటనే సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, రెండో కొడుకు యతీంద్ర బెల్జియం వెళ్లారు. క్లోమవ్యాధితో అవయవాలు దెబ్బతిని రాకేశ్ మరణించారని వైద్యులు ప్రకటించారు. భౌతికకాయాన్ని ఆదివారం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకురానున్నారు. అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.
ప్రధాని మోదీ, సోనియా సంతాపం..: రాకేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. సిద్ధరామయ్య కొడుకు మరణించడంతో తీవ్ర మనో వేదనకు గురయ్యానని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. రాకేశ్ మృతిపై బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యడ్యూరప్పతో పాటు పలువురు నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. ఈ నెల 13న రాకేష్ జన్మదినోత్సవాన్ని అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడం అభిమానుల్లో విషాదం నింపింది.