మహిళా ఎస్‌ఐ ఆత్మహత్యా యత్నం
బెంగళూరు: నగరంలో ఓ మహిళా ఎస్‌ఐ మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డీఎస్పీలైన కల్లప్ప, గణపతిల బలవన్మరణాలు ఘటనలు మరిచిపోవడానికి ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సహచర ఉద్యోగులు చెబుతున్న వివరాల ప్రకారం...స్థానిక విజయనగర పోలీస్‌స్టేషన్‌లో రెండేళ్లుగా ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న రూపా మొదటి నుంచి సున్నిత మనస్కురాలు. దీని వల్ల కేసుల పరిష్కారం సరిగా జరిగేది కాదని తెలుస్తోంది. అయితే పోలీస్‌శాఖలో కొంత కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే విధులుసజావుగా సాగుతాయని ఉన్నతాధికారులు చెబుతూ వచ్చేవారు. అయితే రూపా తన ఆలోచన విధానాన్ని మార్చుకోలేదు. ఈ నేథ్యంలోనే మంగళవారం సాయంత్ర స్టేషన్‌లోని ఉన్నతాధికారులకు, రూపాకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
అటుపై ఆవేశంతో ‘మీకు సరైన గుణపాఠం చెబుతా. డీఎస్పీ గణపతి మాదిరి నేను కూడా...’ అంటూ ఉన్నతాధికారులు ఉన్న గది నుంచి బయటికి వచ్చి వేగంగా యూనిఫాంలోనే తన ఇంటి వైపు వెళ్లారు. ఆ సమయంలో ఆమె నిద్రమాత్రలు మింగారు. కంగుతిన్న అధికారులు అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ రూపాను అనుసరించాల్సిందిగా కానిస్టేబుల్స్‌కు సూచించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత రూపా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే కానిస్టేబుల్స్ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి రూపాను స్థానికుల సహకారంతో దగ్గర్లోని సుగుణ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆసుపత్రి వైద్యాధికారి రవీంద్ర తెలిపారు. ఇదిలా ఉండగా మొబైల్ దొంగతనం విషయం పైన రూపా ఆత్మహత్య యత్నం ఘటనలో మరో వాదన కూడ వినిపిస్తుంది.
స్టేషన్ పరిదిలో ఇటివల జరిగిన ఓ అతి ఖరీదైన మొబైల్ దొంగతనం జరిగింది. రెండు రోజుల ముందు ఆ మొబైల్ రికవరీ కూడ అయింది. అయితే మొబైల్ బాధితుడికి ఆ మొబైల్ ఇవ్వ కుండా రూపా తన వద్ద పెట్టుకుంది. ఈ విషయం ఉన్నతాధికారులకు కూడ తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారి రూపను ప్రశ్నించడమే కాకుండ స్టేషన్ డైరిలో ‘‘రూపా రికవరి మొబైల్‌ను దుర్వినియోగం చేసింది’’ అని లిఖిత పూర్వకంగా రాశారు. దీంతో మనోవేదనకు గురైన రూపా ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. కాగా పోలీసు ఉన్నతాధికారులు చరణ్‌రెడ్డి, సందీప్ పాటిల్ ఆస్పత్రికి వెళ్లి రూపను పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందని సిబ్బందిని ఆరా తీశారు.