వీలింగ్ చేస్తున్న నిందితుడు సయ్యద్ ఐమాన్
కర్ణాటక: మహిళా ఎస్‌ఐ కుమారుడు ద్విచక్రవాహనంతో అతి వేగంగా వీలింగ్ చేస్తూ ఢీకొట్టడంతో ఒక వృద్ధుడు చనిపోగా, మరొక యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హిమ్మావు వద్ద ఆదివారం జరిగింది. నిందితుడు సయ్యద్ ఐమాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
నంబర్ ప్లేట్ లేని బైక్‌తో..
సయ్యద్ ఐమాన్ నంబర్ ప్లేటు లేని ప్లాటినా బైక్‌పై వీలింగ్ చేస్తూ వచ్చి హిమ్మావు గ్రామంలో పశువులను మేపుతూ కూర్చుని ఉన్న సిద్దప్ప(68), గోవిందరాజు (25)లను ఢీకొన్నాడు. సిద్ధప్ప తీవ్ర గాయాలతో చనిపోగా గోవిందరాజును స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నిందితున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. తాను నంజనగూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ యాస్మిన్ తాజ్ కొడుకునని చెప్పాడు. చిన్నపాటి గాయాలైన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుని కుమారుడు మహాదేవస్వామి నంజనగూడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
గతంలోనూ అరెస్టయి
ఇంతకు ముందు కూడా సయ్యద్ ఐమాన్ చోరీ చేసిన స్కూటర్ మీద ప్రమాదకరంగా వీలింగ్ చేస్తూ ఉంటే ప్రజలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి వదిలిపెట్టారు. ఇంతలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు నంజనగూడు ఆస్పత్రి మార్చురి వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. శవాన్ని ఊరికి తీసుకెళ్లబోమని, పోలీసు అధికారి కొడుకునంటూ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటే ఏం చేయాలని ప్రశ్నించారు. అతనితో పాటు తల్లిని కూడా అరెస్టు చేయాలని ధర్నా చేశారు. ఈ విషయం రచ్చ కావడంతో జిల్లా ఎస్పీ సీమా లాట్కర్ సదరు ఎస్‌ఐని ఏ పోస్టింగ్ లేకుండా బదిలీ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment