కొళాయి నీటిపై బాదుడే!
బనశంకరి: ఇప్పటికే కరెంటు, బస్సు, పాలు, మద్యం ధరలు పెరిగి జనం గగ్గోలు పెడుతున్నారు. ఇంతలో బెంగళూరు నగరవాసులకు కొళాయి నీటి చార్జీలు పెరగనున్నాయి. అధిక భారం పడకుండా జలమండలి నీటి చార్జీలను పెంచాలని సూచించానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. మంగళవారం కావేరి భవన్లో బీబీఎంపీ, జలమండలి అధికారులతో సమావేశమయ్యారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. 2014 నుంచి 2024 వరకు సుమారు 11 ఏళ్ల పాటు నీటి చార్జీలను పెంచలేదు. జలమండలికి ఏడాదికి రూ. వెయ్యి కోట్ల నష్టం వస్తోంది. సంస్థకు గతంలో విద్యుత్ బిల్లు రూ.35 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.75 కోట్లు అవుతోంది. ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేవు. సంస్థ నష్టాల్లో ఉందని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా రుణాలు ఇవ్వడం లేదు. ప్రజలపై భారం పడకుండా చార్జీలను పెంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఉచిత నీరు ఉండదు
మురికివాడవాసులకు ప్రతి లీటరు నీటికి ఒక పైసా ధర నిర్ణయించాలని భావిస్తున్నట్లు డీసీఎం తెలిపారు. ఉచిత నీరు అనేది ఉండదరాదన్నారు. నీరు వాడే ప్రతి ఒక్కరూ లెక్కలోకి రావాలని, ఒక పైసా అయినా చెల్లించాలని చెప్పారు. మురికివాడల్లో ఉచితంగా అందించే నీటిని హోటల్స్వారు వ్యాపారానికి వాడుకుంటున్నారని చెప్పారు. అక్రమ కొళాయిలను సక్రమం చేస్తామని తెలిపారు. ఉద్యోగుల వేతనాలను పెంచామని, ఇంకా పెంచాలని గొడవ చేయడం సబబు కాదన్నారు.
నీటి కనెక్షన్ తప్పనిసరి
అపార్టుమెంట్లు కచ్చితంగా కావేరి నీటి కనెక్షన్ను తీసుకోవాలన్నారు, కావేరి 5వ స్టేజ్ పూర్తయిందని, ఇప్పటికు 15 వేల మంది నీటి కనెక్షన్లు తీసుకున్నారని, ఇంకా 20 వేలమంది తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రతి ఇంటికి, అపార్టుమెంటుకు వెళ్లి కావేరి నీటి కనెక్షన్ తీసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు.
మురికివాడల్లో మంచి నీటిపైనా చార్జీల వసూలు
బెంగళూరువాసులపై మరో భారం
నష్టాల్లో జలమండలి: డీసీఎం శివకుమార్
Comments
Please login to add a commentAdd a comment