బెళగావిలో ఐటీ దాడులు
బనశంకరి: ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణలపై బెళగావి కి చెందిన పారిశ్రామికవేత్తలు వినోద్ దొడ్డణ్ణ, పుష్ప దంత దొడ్డణ్ణ, అజిత్పటేల్, అశోక్ హుంబరవాడి నివాసాలు, కార్యాలయాలపై సోమవారం అర్ధరాత్రి ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. దొడ్డణ్ణ కుటుంబాలకు చక్కెర, ఐరన్, గ్రానైట్ తదితర పరిశ్రమలున్నాయి. దేశవిదేశాలకు ఎగుమతి చేస్తారు. కాగవాడ తాలూకాలో రెండు చక్కెర ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. అలాగే బెళగావి క్యాంప్ ఏరియాలో ఉన్న పారిశ్రామికవేత్త అజిత్పటేల్, గణేశ్పురలోని అశోక్ ఐరన్ యజమాని అశోక్ హుంబరవాడి ఇంట్లో మంగళవారం కూడా సోదాలు కొనసాగాయి. గోవా, బెంగళూరు ఐటీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.
డిపాజిట్ల గోల్‌మాల్‌లో ముగ్గురు అరెస్టు
యశవంతపుర: బెంగళూరు నగర జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (బీడీసీసీ)కి చెందిన అపెక్స్ సహకార బ్యాంక్‌లో రూ.19.34 లక్షల డిపాజిట్ల మళ్లింపు కేసులో సీఐడీ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బ్యాంకు గత సీఈఓ పి.ఆశాలత, భర్త సోమశేఖర్, విజయక్ కిరణ్, జె మంజునాథ్, సుజయ్, మరికొందరు ఉద్యోగులపై పోలీసులు విచారణ చేపట్టారు. మొదటి నిందితుడు ఆశాలత సోదరుని కొడుకు జె మంజునాథ్, అతని స్నేహితుడు విజయ్ కిరణ్, సుజయ్లను ఇప్పుడు అరెస్ట్ చేశారు. జె.మంజునాథ్ వాణిజ్య పన్నులశాఖలో క్లర్కు. మిగతా ఇద్దరు టెక్కీలని తెలిసింది. ఇక ఆశాలత దంపతులు పరారీలో ఉన్నారు.
డ్రగ్స్ విక్రేత అరెస్టు
యశవంతపుర: కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్న కేరళవాసిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి రూ.10 లక్షలు విలువగల ఎండీఎంఎ, హైడ్రో గంజా, ఎక్స్టసి మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు లింగదీరనహళ్లిలో కేరళ వ్యక్తి, మరో ఆఫ్రికన్ సహాయంతో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసింది. దీంతో బ్యాడరహళ్లి పోలీసులు కేరళవాసిని పట్టుకుని డ్రగ్స్ సీజ్ చేశారు. ఆఫ్రికన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
టేకాఫ్ కాని విమానం
●ప్రయాణికుల అవస్థలు
బనశంకరి: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు సోమవారం రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం సాయంత్రం 7 గంటలకు సౌదీ అరేబియాలోని దమామ్ కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌కు సిద్ధం కాగా, యాంత్రిక లోపం ఏర్పడినట్లు పైలట్లు గుర్తించారు. విమానంలో లైట్లన్నీ ఆఫ్ అయ్యాయి. ప్రయాణికులు చీకట్లో కూర్చున్నారు. టేకాఫ్‌ని రద్దు చేయడంతో ప్రయాణికులను విమానాశ్రయంలోకి పంపించారు. రాత్రంతా ప్రయాణికులు లాంజ్‌లోనే ఉండిపోయారు. మంగళవారం ఉదయం 7.20 విమానంలో లోపం సరిచేయగా, టేకాఫ్ అయ్యింది.
ప్రాణం కోసం
హెల్మెట్ ముఖ్యం
చిక్కబళ్లాపురం: ట్రాఫిక్ నియమాలను అందరూ తప్పనిసరిగా పాటించాలి, హెల్మెట్ ధరించాలి అని జిల్లా జడ్జి వీరభద్రయ్య భవాని తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో రోడ్డు సురక్షతా అభియాన జాతాను ప్రారంభించారు. బైకిస్టులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, పోలీసు రూల్సు కోసం కాకుండా ప్రాణం విలువను తెలుసుకొని పాటించాలని జడ్జి తెలిపారు. బైక్ వెనుక కూర్చునేవారూ హెల్మెట్‌ను ధరించాలని సూచించారు. కార్లలో తప్పక సీట్ బెల్ట్ ధరించాలి, ట్రాఫిక్ సిగ్నళ్లను అనుసరించాలని చెప్పారు. ఎస్పీ కుశాల్ చౌక్సి, జడ్జి శిల్ప, న్యాయవాది అభిలాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణ వీధుల్లో జాతా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment