న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ శాఖను రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఆయన శుక్రవారం సాయంత్రం హోంమంత్రితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రాజధానిలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఢిల్లీ పోలీస్ శాఖ రాష్ట్ర పరిధిలో లేకపోవడంతో నేరాల నియంత్రణలో జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారిని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తే నగరంలో జరిగే ప్రతి నేరానికి వారు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోగలమన్నారు. షిండేతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.‘అవసరమనుకుంటే ఎన్‌డీఎంసీ ప్రాంతం,లూటియన్స్ జోన్‌లను కేంద్ర నియంత్రణలో ఉంచుకుని, మిగిలిన నగర శాంతి భద్రతల పర్యవేక్షణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని షిండేను కోరామన్నారు.
అలాగే నగరంలో డెన్మార్క్ మహిళపై సామూహిక అత్యాచారం, మాలవీయనగర్‌లో డ్రగ్ రాకెట్‌పై దాడులు, పశ్చిమ ఢిల్లీలో మహిళ అనుమానాస్పద మృతి కేసులకు సంబంధించి నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశామన్నారు. కాగా వీరి డిమాండ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే సమాచారమిస్తానని షిండే తమకు హామీ ఇచ్చారని కేజ్రీవాల్ తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు మనీష్ సిసోడియా, సోమ్‌నాథ్ భారతి, రాఖీ బిర్లా ఉన్నారు.
ఢిల్లీ సర్కారు పరిధిలో పోలీస్
Published Fri, Jan 17 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement