ఎస్‌ఐ కుమార్తెపై కత్తితో దాడి
కేకే.నగర్: ప్రేమించలేదన్న కోపంతో ఎస్‌ఐ కుమార్తెపై కత్తితో దాడి జరిపిన యువకుడిపై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తిరుచ్చి సమీపంలోని నెంబర్‌వన్ టోల్‌గేట్ పిచ్చాండవర్ కోవిల్ పాండురంగన్ అపార్టుమెంట్స్‌కు చెందిన రవి. తిరుచ్చి ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్. ఇతని భార్య ఫాతిమా. ఈమె కంటోన్మెంట్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తోంది. వీరి కుమార్తె మోనిక(25). సత్రం ప్రాంతంలోని కళాశాలలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజూ బస్సులో కాలేజీకి వెళ్లి వస్తోంది. పిచ్చాండవర్ కోవిల్ కల్లలర్ వీధికి చెందిన ముత్తుమణి. సిరుకనూర్ సమీపంలోని పాండియపురం ప్రభుత్వ పాఠశాల్లో ప్రధానోపాధ్యాయుడు.
ఇతని కుమారుడు బాలా అలియాస్ బాల మురుగన్(26) డిప్లమో చదివి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. బాలా, మోనికా రెండేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసి మోనికా తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మోనిక, బాలా రెండేళ్ల క్రితం విషం తాగి ఆత్మహత్యకు యత్నించి బతికి బయటపడ్డారని తెలుస్తోంది. తర్వాత మోనిక తల్లిదండ్రుల మాట విని బాలాతో మాట్లాడడం మానేసింది. తనతో ఎందుకు మాట్లాడడం లేదని, తనను ప్రేమించాలంటూ బాలా ఆమె కాలేజీకి వెళ్లే సమయంలో వేధించేవాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం మోనిక చదువుతున్న కళాశాలకు వెళ్లి తనను ప్రేమించాలని బలవంతం చేసి ఆమె సెల్‌ఫోన్ లాక్కున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మోనిక తల్లి ఫాతిమాతో చెప్పడంతో ఆమె బాలాను స్టేషన్‌కు పిలిపించి మందలించింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మోనిక కళాశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. శరీరంపై ఎనిమిది చోట్ల కత్తిగాట్లు తగలడంతో మోనిక రక్తం మడుగులో పడిపోయింది.
ఆ సమయంలో అక్కడ ఉన్న అరుళ్‌మొళి అనే వ్యక్తి బాలాను పట్టుకున్నాడు. మోనికను అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్సలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విషం తాగి ఉన్న బాలాను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ మతిస్థిమితం కోల్పోయిన వాడిలాగా నటించిన బాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా హింసాత్మక నిరోధక చట్టం, హత్యాయత్నం తదితర మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.