పోరుబిడ్డకు జోహార్లు | komurambheem death anniversary | Sakshi
Sakshi News home page

పోరుబిడ్డకు జోహార్లు

Published Mon, Oct 17 2016 11:20 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

పోరుబిడ్డకు జోహార్లు

పోరుబిడ్డకు జోహార్లు

జోడేఘాట్‌లో ఘనంగా కుమ్రం భీం వర్ధంతి
హాజరైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ 
మంత్రి చందూలాల్, గృహనిర్మాణ, 
న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, 
అటవీ సంక్షేమ, బీసీ శాఖ మంత్రి జోగు రామన్న 
తెలంగాణ సారథి ఆధ్వర్యంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
భారీగా తరలివచ్చిన అడవి బిడ్డలు 
 
ఆసిఫాబాద్‌/కెరమెరి : జోడేఘాట్‌లో కొత్తగా నిర్మించిన భీం సమాధి వద్ద భీం మనవడు కుమ్రం సోనేరావు, ఆదివాసీ సంఘాల నాయకులు నాలుగు గోత్రాల జెండాలు ఎగురవేశారు. రాష్ట్ర గిరిజన , పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, టీఎస్‌టీడీసీ చైర్మన్‌ పేర్వారం రాములు, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఆసిఫాబాద్, సిర్‌పూర్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, టూరిజం ఎండీ కిష్టినా జెడ్‌ బోంగ్దూ, ఐటీడీఏ పీవో, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ లక్ష్మణ్, కుమ్రం భీం జిల్లా కలెక్టర్‌ చంపాలాల్, మంచిర్యాల కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రజాప్రతినిధులు, అధికారులు భీంకు ఘనంగా నివాళులర్పించారు.
 
టూరిజం కేంద్రంగా అభివృద్ధి   – చందూలాల్, రాష్ట్ర మంత్రి
జోడేఘాట్‌ను టూరిజం కేంద్రంతో పాటు అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ అన్నారు. భీం వర్ధంతి సందర్భంగా జోడేఘాట్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. జోడేఘాట్‌ పర్యాటక కేంద్రానికి అనుకూలంగా ఉందని, ఈ  విషయం  సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కుమ్రం భీం వారసులు, ఆదివాసీల ఆత్మగౌరవం కాపాడేందుకే సీఎం కేసీఆర్‌ ఆసిఫాబాద్‌కు కుమ్రం భీం జిల్లాగా నామకరణం చేశారన్నారు. భీం చేసిన పోరాటాల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. కుమ్రం భీం అసువులు బాసిన వీరభూమి వద్ద రూ.25 కోట్లతో మ్యూజియం, స్మృతి చిహ్నం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 51 గిరిజన ఇంగ్లిష్‌ మీడియం ఆశ్రమ పాఠశాలలు, 119 బీసీ ఆశ్రమ వసతి గృహాలు, 100 ఎస్సీ ఆశ్రమ వసతి గృహాలు, 71 మైనార్టీ వసతి గృహాలు మంజూరు చేసినట్లు మంత్రి చందూలాల్‌ తెలిపారు. 
 
పాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు – జోగు రామన్న, మంత్రి
పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆసిఫాబాద్‌కు కుమ్రం భీం జిల్లాగా నామకరణం చేయడం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. చిన్న జిల్లాలు ఆదివాసీల అభివృద్ధికి దోహద పడుతాయని, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయన్నారు. గత ఏడు దశాబ్దాలుగా సమైక్య పాలకులు జోడేఘాట్‌లో వర్ధంతి సభకు అనుమతించలేదని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక తొలిసారి సీఎం కేసీఆర్‌ జోడేఘాట్‌ వర్ధంతి సభకు హాజరై ఆదివాసీ గిరిజనుల్లో ఆత్మసై్థర్యం నింపారన్నారు. 
 
రెండేళ్లలో జిల్లా అభివృద్ధి – ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి
కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో రెండేళ్లలో కుమ్రం భీం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ వద్ద కుమ్రం భీం విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించామన్నారు. కొత్త జిల్లాలో గిరిజనులు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని, భీం పేరుతో 31వ జిల్లాగా ఏర్పాటు కావడం ఆదివాసీల అభివృద్ధికి సంకేతమన్నారు. 
 
అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఏర్పాటు చేయాలి  – పేర్వారం రాములు, టీఎస్‌టీడీసీ చైర్మన్‌ 
చెట్లు, కొండలు, కోనలు, అడవులతో జోడేఘాట్‌లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని టీఎస్‌టీడీసీ చైర్మన్‌ పేర్వారం రాములు అన్నారు. దేశ విదేశీయులను ఆకట్టుకునేలా కుమ్రం భీం అసువులు బాసిన పుణ్యభూమిలో అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే, ఇక్కడి ఆదివాసీ గిరిజనులకు సుమారు వెయ్యి ఉద్యోగాలు వస్తాయన్నారు. కుమ్రం భీమ్‌ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు.
 
సీఎం హామీలు నెరవేర్చారు – కోవ లక్ష్మి, ఎమ్మెల్యే 
రెండేళ్ల క్రితం జోడేఘాట్‌ సభలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. జోడేఘాట్‌లో భీం కాంస్య విగ్రహం, స్మృతి చిహ్నం, మ్యూజియం నిర్మాణం పూర్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ భీం మనవడు సోనేరావుకు ఐదెకరాల భూమి, రూ.10లక్షల ఆర్థికసహాయం అందించినట్లు తెలిపారు. ఇద్దరు కూతుళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్‌కు కుమ్రం భీమ్‌ జిల్లాగా నామకరణం చేసి ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. 
 
జిల్లాలో టూరిజం అభివృద్ధి చేయాలి  – పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ 
కుమ్రం భీం జిల్లాలోని సమితుల గుండం, సిర్‌పూర్‌ (యు)లోని మిట్ట జలపాతాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ సూచించారు. గత ప్రభుత్వాలు జోడేఘాట్‌ వర్ధంతికి అధికారులు, ప్రజా ప్రతినిధులను అనుమతించలేదని, భీమ్‌ చరిత్రను మరుగున పడేలా చేశాయన్నారు. రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్‌ జోడేఘాట్‌లో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశారన్నారు.
 
మంత్రుల వెన్నంటి ఉండాలి – కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే
మొన్నటి వరకు ఒకే జిల్లాగా ఉన్న ఆదిలాబాద్‌ నుంచి నాలుగు జిల్లాలుగా వేరైనప్పటికీ కుమ్రం భీం జిల్లా అభివృద్ధికి జిల్లా మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌ రెడ్డి వెన్నంటి ఉండాలన్నారు. భీం జిల్లాలో సాగు నీటికి కొదవ లేదని, రాబోయే రోజుల్లో జిల్లాలోని ప్రాజెక్టులు పూరై్త వ్యవసాయాభివృద్ధి చెందుతుందన్నారు. మండలంలోని కుమ్రం భీం ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని, త్వరలో మిగితా పనులు పూర్తవుతాయన్నారు. జిల్లాకు సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. 
 
భీం ఆశయ సాధనకు పాటుపడతా – చంపాలాల్, కలెక్టర్‌ 
కుమ్రం భీం ఆశయ సిద్ధికి పాటు పడతానని కలెక్టర్‌ చంపాలాల్‌ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కుమ్రం భీం తొలి జిల్లా కలెక్టర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానన్నారు. రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. మంచిర్యాల కలెక్టర్, ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్‌తో మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షత వహించగా, టూరిజం ఎండీ కిష్టినా జెడ్‌ బోంగ్డూ, జేసీ అశోక్‌కుమార్, సబ్‌కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్, ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ కమిషనర్‌ లక్ష్మణ్,  జెడ్పీటీసీ సభ్యులు అరిగెల నాగేశ్వర్‌ రావు, అబుల్‌ కలాం, ఏమాజీ, ఎంపీపీ సారాబాయి, ఆదివాసీ సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement