దుమారం | ks Eshwarappa criticized for controversial comments | Sakshi
Sakshi News home page

దుమారం

Published Sun, Nov 9 2014 2:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

దుమారం - Sakshi

దుమారం

కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు
గొంతు కలిపిన సొంత పార్టీ నేతలు
బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ‘యూత్ కాంగ్రెస్’ డిమాండ్
నేనలా అనలేదంటూ మాటమార్చిన కేఎస్

 
కేఎస్ ఈశ్వరప్పకు నోటి దురద ఎక్కువని మరోసారి రుజువైంది. రాష్ర్టంలో జరుగుతున్న అత్యాచారాలపై ఆయన శుక్రవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కూతురి పైనో, హోం శాఖ మంత్రి కూతురిపైనో అత్యాచారం జరిగి ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలిసొచ్చేది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా స్వపక్షం నుంచీ విమర్శలు గుప్పుమన్నాయి. దీంతో నేనలా అనలేదంటూ కేఎస్ మాటమార్చారు.
 
అత్యాచార ఘటనలపై మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వరప్ప మాట్లాడుతూ...‘రాష్ట్రంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అత్యాచార ఘటనలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి కూతురి పైనో, హోం శాఖ మంత్రి కూతురిపైనో అత్యాచారం జరిగి ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలిసొచ్చేది. కనీసం అప్పుడైనా అత్యాచారాల నిరోధానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేవారేమో..’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై రాష్ర్ట వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేగింది. ఈశ్వరప్ప చేసిన ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీతో పాటు స్వపక్షం నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి.

కేఎస్ సంస్కారం తెలిసింది

ఈశ్వరప్ప వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలతో ఆయన సంస్కారం ఏపాటిదో తెలిసింది. రాజకీయాల్లో ఇంత అనుభవం ఉండి ఇలా మాట్లాడడం ఏమాత్రం సరికాదు. ఇప్పటికైనా ఈశ్వరప్ప స్థాయికి తగ్గట్టు మాట్లాడడం నేర్చుకోవాలి’ అని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వీఎస్ ఉగ్రప్ప మాట్లాడుతూ...‘ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఆయన గౌరవాన్ని దిగజార్చేవిగా ఉన్నాయి’ అంటూ మండిపడ్డారు. ఇక ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కర్ణాటక యూత్ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో బెంగళూరు, శివమొగ్గ ప్రాంతాల్లోని ఈశ్వరప్ప నివాసాలను ముట్టడించారు. అంతేకాక మైసూరు, తుమకూరు తదితర ప్రాంతాల్లో ఈశ్వరప్ప వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్నాలను నిర్వహించారు. ఈశ్వరప్ప తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

స్వపార్టీ నుంచీ విమర్శలు..

ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు స్వపక్షమైన బీజేపీ నుంచి సైతం విమర్శలు ఎదురయ్యాయి. ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి ఢిల్లీలో స్పందిస్తూ...‘ఈశ్వరప్ప ఇలా మాట్లాడడం సరికాదు. ఆ వ్యాఖ్యలను పార్టీ సమర్థించడం లేదు. అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు మేం పోరాటాన్ని సాగిస్తున్నామే కానీ వ్యక్తిగతంగా ఎవరినీ దూషించడం సరికాదు. ఈ విషయాన్ని మేం ఈశ్వరప్పతో పార్టీ సమావేశంలో కూడా చెబుతాం’ అని పేర్కొన్నారు.

నేనలా అనలేదు...

ఇక తన వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు స్వపక్షం నుంచి సైతం విమర్శలు రావడంతో ఈశ్వరప్ప మాటమార్చారు. ‘నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి పిల్లలపై నాకు గౌరవం ఉంది. వారిపై అత్యాచారం జరగాలని అనలేదు. అలా జరిగితేనే కళ్లు తెరుస్తారా అన్నాను. నా ఇంటి ముందు ఇలాంటి నిరసనలు మామూలే’ అని పేర్కొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement