
రాజకీయాల్లో రాణించడం తప్పా? : కుష్బూ
మహిళలను విమర్శలకు గురిచేస్తూ అడ్డుకుంటున్నారని, రాజకీయాల్లో మహిళలు రాణించడం తప్పా? అంటూ నటి కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీ నగర్: మహిళలను విమర్శలకు గురిచేస్తూ అడ్డుకుంటున్నారని, రాజకీయాల్లో మహిళలు రాణించడం తప్పా? అంటూ నటి కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అనేక పార్టీలు ఉండగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారని కొందరు ప్రశ్నించగా తనకు చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఏర్పడిందన్నారు. ఇంట్లోవున్న తన గదిలో రాజీవ్ గాంధీ చిత్రాలను అతికించానన్నారు. దేశం పట్ల, ప్రజల పట్ల అధిక శ్రద్ధ కలిగిన పార్టీ కాంగ్రెస్ అని, అందువల్ల ఆ పార్టీలో చేరానని బదులిచ్చారు.
డీఎంకే నుంచి వైదొలగిన కారణాన్ని ఇంతవరకు తెలియజేయకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించగా, అది ముగిసిపోయిన వ్యవహారమని, దానిగురించి ప్రస్తుతం ప్రస్తావించదలచుకోలేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని పేర్కొంటున్నారే అని ప్రశ్నించగా ఇప్పుడే దీన్ని నిర్ణయిస్తే ఎన్నికల కమిషన్ ఎందుకు ఎన్నికలు జరపాలంటూ ఎదురు ప్రశ్న వేశారు. మహిళలు రాజకీయంగా ఎదక్కుండా పలువురు అడ్డుపడుతుంటారని, మహిళలు రాజకీయాలలో రాణించడం తప్పా? అని ప్రశ్నించారు.