
ఔరంగజేబుతో పోలిక సబబే..
హైదరాబాద్: కమిషన్ల కోసమే కేంద్రం చేపట్టాల్సిన పోలవరం పనులను చంద్రబాబు తీసుకున్నారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా.. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆయన ధ్వజమెత్తారు.
24 వేల కోట్ల ప్రాజెక్టుకు బాబు తీసుకొచ్చిన నిధులు కేవలం 2 వేల కోట్లు అని కేవీపీ వెల్లడించారు. 2018లోపు పోలవరం ప్రాజెక్టు ఎట్టిపరిస్థితుల్లోను పూర్తి చేయలేరని, వాస్తవ పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 144 కిలోమీటర్ల పోలవరం కుడికాల్వను పూర్తి చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కేవీపీ గుర్తుచేశారు. ఆ కాల్వలకు మోటార్లు బిగించి నదులు అనుసంధానం చేశామని బాబు గొప్పలు చేప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఆత్మీయుల హననానికి సైతం వెనుకాడని ఔరంగజేబుతో చంద్రబాబును ఎన్టీఆర్ పోల్చడం సబబే అని పోలవరం విషయంలో మరోసారి రుజువైందని లేఖలో పేర్కొన్నారు కేవీపీ రామచంద్రరావు.