లజ్‌పత్‌నగర్ దోపిడీ కేసుదర్యాప్తులో కీలక మలుపులు | Lajpat Nagar robbery: 'Honda City car was used by Vindu Dara Singh' | Sakshi
Sakshi News home page

లజ్‌పత్‌నగర్ దోపిడీ కేసుదర్యాప్తులో కీలక మలుపులు

Published Thu, Jan 30 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM

Lajpat Nagar robbery: 'Honda City car was used by Vindu Dara Singh'

న్యూఢిల్లీ: లజ్‌పత్‌నగర్ భారీ దోపిడీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. వ్యాపారి రాజేశ్ కల్రా నుంచి దోపిడీకి గురైన మొత్తం దుబాయి నుంచి హవాలా మార్గం నుంచి వచ్చిందనడానికి కొన్ని ఆధారాలు దొరకడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ విషయమై మరిన్ని వివరాలు సేకరించేందుకు ముంబై పోలీసులను సంప్రదిస్తామని దర్యాప్తు అధికారులు గురువారం తెలిపారు. కల్రాకు లండన్, దుబాయిలోని బుకీలతోనూ సంబంధాలు ఉన్నట్టు వస్తున్న సమాచారంపైనా కన్నేశారు. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిందితుడు, బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్‌తోనూ ఇతనికి సన్నిహిత సంబంధాలున్నట్టు తేలింది. 
 
 దుబాయి, జైపూర్, ముంబై, లండన్‌కు చెందిన వ్యక్తులతో ఈ వ్యాపారి తరచూ ఫోన్లలో మాట్లాడుతున్నట్టు కూడా గుర్తించారు. ఇతని డబ్బు దోపిడీ కావడానికి ముందు రోజు సైతం రాజేశ్ దుబాయి వ్యక్తితో 20 నిమిషాలు మాట్లాడారని ఢిల్లీ పోలీసుశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ఆగ్నేయ ఢిల్లీ పోలీసులు, క్రైంబ్రాంచ్ అధికారులు కల్రా ఉద్యోగులు, అతని మేనేజర్, రాకేశ్ కుమార్ అనే వ్యాపారి సహా పలువురిని మండీనగర్‌లోని స్పెషల్‌స్టాఫ్ కార్యాయంలో ప్రశ్నించారు. ‘రాజేశ్ కల్రా వ్యాపార భాగస్వామి రాహుల్ అహుజానూ ఈ కేసులో ప్రశ్నించినా ఎటువంటి వివరాలూ వెల్లడికాలేదు.
 
 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టయిన జైపూర్ బుకీ చంద్రేశ్‌జైన్ ఎలియాస్ జూపిటర్‌తోనూ కల్రాకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించాం’ అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. జూపిటర్‌తోపాటు, లండన్‌కు చెందిన బుకీ సంజీవ్ చావ్లా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిందితుడు.  రాజేశ్‌కు పలువురు బుకీలతో సంబంధాలున్నట్టు వెల్లడయిన నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ క్రికెట్ పోటీల్లోనూ ఏవైనా అక్రమాలు జరుగుతున్నాయా అనే కోణంలోనూ పోలీసులు దృష్టి పెట్టారు. లజ్‌పత్‌నగర్ దోపిడీలో రూ.ఎనిమిది కోట్లు పోయినట్టు కల్రా చెబుతున్నా.. అంతకంటే పెద్ద మొత్తమే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో విదేశీ కరెన్సీ కూడా ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement