
మంజీ సర్కారుకు ఆర్జేడీ మద్దతు
సోనియాతో లాలూ భేటీ... బీజేపీతో పోరాడతానని బాస
పాట్నా/న్యూఢిల్లీ: బీహార్‌లో జితన్‌రామ్ మంజీ నేతృత్వంలో ఏర్పడిన జేడీయూ కొత్త ప్రభుత్వానికి ఆర్జేడీ గురువారం మద్దతు ప్రకటించింది. ఇప్పటికే తగినంత మెజారిటీ ఉన్న జేడీయూ సర్కారు మనుగడకు తమ మద్దతు అవసరం కాకున్నా, తొలిసారిగా మహాదళిత వర్గానికి చెందిన మంజీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినందున జేడీయూ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నామని ఆర్జేడీ శాసనసభాపక్ష నేత అబ్దుల్‌బరీ సిద్దిఖీ గురువారం తెలిపారు. మతతత్వ శక్తులతో పోరాటంలో భాగంగానే మంజీ నేతృత్వంలోని జేడీయూ సర్కారుకు తాము మద్దతు ఇస్తున్నామని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చెప్పారు.
తాజా పరిణామాలతో బీహార్‌లో బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగనున్నట్లు సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో లాలూ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. సర్వశక్తులనూ ఒడ్డి బీజేపీతో పోరాటం సాగిస్తానని ఆయన సోనియాకు హామీ ఇచ్చారు. ‘ఇది తుపాను. ఎంతోకాలం ఉండదు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా సర్వశక్తులనూ ఒడ్డి పోరాటం సాగిస్తాం’ అని లాలూ అన్నారు. ఇందులో భాగంగానే బీహార్‌లోని జేడీయూ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు.