రైళ్ల సంఖ్య అంతంతే | less number of trains | Sakshi
Sakshi News home page

రైళ్ల సంఖ్య అంతంతే

Published Tue, May 20 2014 10:08 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

రైళ్ల సంఖ్య అంతంతే

రైళ్ల సంఖ్య అంతంతే

తెలుగు ప్రయాణికుల ఇక్కట్లు ఇన్నిన్ని కాదయా
 
 సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్లే రైళ్ల సంఖ్య అంతంతగానే ఉండడంతో నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రద్దీ కారణంగా టికెట్లు లభించలేదని వాపోతున్నారు. గంటలకొద్దీ తత్కాల్ టికెట్ కోసం క్యూ కట్టినా ఫలితం దక్కడం లేదని వారు చెబుతున్నారు. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ 2013-2014 రైల్వే బడ్జెట్‌లో ప్రకటించినవిధంగానే ముంబై (లోకమాన్య తిలక్ టెర్మినస్) - నిజామాబాద్, ముంబై (లోకమాన్యతిలక్ టెర్మినస్) - కాకినాడ రైళ్లను ప్రారంభించినప్పటికీ ఆశించినమేర ప్రయోజనం ఉండడం లేదని వాపోతున్నారు.
 
వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ పెరిగిపోయిందని, ఈ కారణంగా టికెట్లు లభించడంలేదని చెబుతున్నారు. నిజామాబాద్, హైదరాబాద్‌ల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాలకు కూడా వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లను నడపడం సాధ్యం కాకపోతే కనీసం కనీసం అదనపు బోగీలైనా అమర్చాలని వారంతా కోరుతున్నారు. ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని దాదాపు అన్ని జిల్లాలకు చెందినవారు నివసిస్తున్నారు. వీరిలో కరీంనగర్, నిజామాబాద్, మెదక్ తదితర తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సులతోపాటు ప్రైవేటు బస్సులు ఉన్నప్పటికీ రైళ్ల చార్జీల (స్లీపర్, జనరల్ క్లాస్)తో పోలిస్తే ఈ బస్సులకు దాదాపు రెండు నుంచి నాలుగింతలమేర అధికంగా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది.
 
 దీంతో అనేక మంది రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. ముంబై, ఠాణే, భివండీ, కల్యాణ్ తదితర చుట్టుపక్కల నివసించే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతోపాటు అదిలాబాద్ జిల్లాలోని లక్సెట్టిపేట,  మంచిర్యాల తదితర ప్రాంతాల తెలుగు ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ముంబై నుంచి ప్రతిరోజూ నడిచే దేవగరి ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు కొత్తగా లోకమాన్యతిలక్ (కుర్లా)-నిజామాబాద్‌ల మధ్య రైలును ప్రారంభించినప్పటికీ ఇది వారానికి ఒకసారే నడుస్తోంది.

దీంతో అనేకమంది దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కే మొగ్గుచూపుతున్నారు. దీంతో వేసవి సెలవుల సమయంలో ఇదికూడా బాగా రద్దీగా ఉంటోంది. అత్యధిక శాతం మంది ప్రజలు దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలుపైనే ఆధారపడుతున్నారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ లభించని సందర్భంలో మరో రైలు టికెట్‌కోసం యత్నిస్తున్నారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం ఉండడం లేదు. దేవగరి రైలులో నిజామాబాద్‌కు ప్రత్యేక కోటా లేకపోయినప్పటికీ నాందేడ్ ప్రజలకు మాత్రం ఈ రైలులో ప్రత్యేక కోటాను కల్పించారు. దీంతో ఏ కాలంలోనూ ఈ రైలు టికెట్లు దొరకడం లేదు. ఒకవేళ తత్కాల్ టికెట్ల కోసం యత్నించినా అది క్షణాల్లో వెయిటింగ్ జాబితాకి చేరుకుంటోంది.
 
 మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన రైలులోకూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మార్గంలో మరో కొత్త రైలు కేటాయించపోయినప్పటికీ కనీసం దేవగరి రైలుకు మరిన్ని బోగీలను అమర్చడంతోపాటు లోకమాన్యతిలక్ టెర్మినస్-నిజామాబాద్ రైలును ప్రతి రోజూ నడపాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ముంబై నుంచి ఈమార్గంలో వెళ్లే ఏదైనా ఓ రైలును నిజామాబాద్ వరకు పొడగించాలని వారు కోరుతున్నారు. ఇలాంటి వాటిలో ప్రస్తుతం సికింద్రాబాద్-మన్మాడ్‌ల మధ్య నడుస్తున్న అజంతా ఎక్స్‌ప్రెస్, ముంబై-నాందేడ్‌ల మధ్య నడుస్తున్న తపోవన్ ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. అదేవిధంగా వీలైతే నిజామాబాద్ మీదుగా మన్మాడ్, నాగర్‌సోల్ వరకు నడుస్తున్న రైళ్లను ముంబైదాకా పొడగించాలని కూడా తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.
 
ఠాణేలో ఆపాలి
నిజామాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కొద్దిసేపు ఠాణేలో ఆపాలని తెలుగు ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో తెలంగాణ ప్రాంత ప్రజలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లావాసులు కూడా నివసిస్తున్నారు. వీరంతా స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రస్తుతం కోణార్క్, విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లతోపాటు కొత్తగా ప్రవేశపెట్టిన లోకమాన్యతిలక్-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. అదేవిధంగా వారానికి ఒకసారి నడిచే భావ్‌నగర్-కాకినాడ రైలు కూడా కల్యాణ్ మీదుగానే వెళుతుంది.

ఇక ఎల్‌టీటీ-కాకినాడ రైలును వారానికి రెండుసార్లు నడుపుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంతాల ప్రజలకు కోసం కొత్తగా ప్రారంభించిన లోకమాన్య తిలక్ టెర్మినస్-నిజామాబాద్ రైలుతోపాటు పైనపేర్కొన్న రెళ్లలో ప్రయాణించేందుకు ఠాణే చుట్టుపక్కల నివసించే ప్రజలకు లోకమాన్యతిలక్ టెర్మినస్ లేదా, కల్యాణ్ వరకు వెళ్లాల్సి వస్తోంది. ఈ రైళ్లను  ఠాణేలో నిలపకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుగు ప్రయాణికులు వాపోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement