నాపై రోజుకో బుల్లెట్ పేలుస్తున్నారు: సీఎం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. బైజాల్ ప్రతి రోజూ తనపై ఓ బుల్లెట్ పేలుస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. గతేడాది డిసెంబర్ 31న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అనిల్ బైజాల్ నియమితులయ్యాక కేజ్రీవాల్ ఆయనపై నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి.
కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌తో తాము సత్సంబంధాలు కొనసాగించామని, ఆయన మాత్రం మొదటి మూడు నెలలు సఖ్యతగా ఉన్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా, ఆయన రోజుకో బుల్లెట్ తనపై పేలుస్తున్నారని, తమ తప్పిదమేంటో చెప్పాలని కేజ్రీవాల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ కార్యాలయాన్ని సాధ్యమైనంత త్వరగా ఖాళీచేయాలని అనిల్ బైజాల్ ఇటీవల సీఎం కేజ్రీవాల్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ను సంప్రదించకుండా పార్టీ కోసం భూమి కేటాయించుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.