‘మాఫీ’పై మీ వైఖరేంటి?
ముంబై : రుణమాఫీపై ప్రభుత్వం తన వైఖరి తెలిపే వరకు కాంగ్రెస్ చర్చలో పాల్గొనదని ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్, మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ తేల్చి చెప్పారు. రుణమాఫీపై మీడియా తన మాటలు వక్రీకరించిందని ఫడ్నవీస్ చెప్పారని, అదే నిజమైతే ఆ వ్యాఖ్యలను సభలో ప్రకటించాలన్నారు. రుణ మాఫీ సాధ్యం కాదని సీఎం అన్నప్పుడు సభలో దానిపై చర్చ ఎందుకని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీలో సభా కార్యక్రమాలు మొదలైన తర్వాత మాఫీపై ప్రభుత్వ వైఖరి తెలపాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు.
కాగా, రైతుల రుణ మాఫీ కోసం విధాన్ భవన్ ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు ఎన్సీపీ మద్దతు ప్రకటించలేదు. గోందియా జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలపడమే దీనికి కారణమని తెలుస్తోంది. గోందియా జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఎన్సీపీతో కాంగ్రెస్ కలవకుండా బీజేపీతో పొత్తు పెట్టుకొని జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ పదవి దక్కించుకుంది. బీజేపీకి వైస్ ప్రెసిడెంట్ పదవి చేజిక్కించుకుంది. మరోవైపు భండారాలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకొని ప్రెసిడెంట్ పదవి దక్కించుకుంది. వైస్ ప్రెసిడెంట్ పదవి ఎన్సీపీ చేజిక్కించుకుంది.
మరోవైపు బీజేపీతో కలసివెళ్లాలనే గోందియా స్థానిక నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం స్వాగతించదని కాంగ్రెస్ నేతలంటున్నారు. శాసనమండలి కాంగ్రెస్ నేత మానిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. రెండు పార్టీలు రైతు సమస్యలపై కలసికట్టుగా పోరాడతాయన్నారు. గోందియా వ్యవహారంలో నిర్ణయాన్ని సోమవారం తెలుపుతామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపాల్‌దాస్ అగర్వాల్‌తో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అనేకమార్లు చర్చించినప్పటికీ దాస్‌ను ఒప్పించడంలో విఫలమయ్యారు.
చిన్న చిన్న సమస్యలను పక్కన పెడతాం: అశోక్ చవాన్
రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ప్రెసిడెంట్ అశోక్ చవాన్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీపై ప్రభుత్వ వైఖరేంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై పోరాడేందుకు చిన్న చిన్న సమస్యలను పక్కన పెడతామన్నారు. గోందియా విషయాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం సభ 45 నిమిషాలు వాయిదా పడి తిరిగి సమావేశమైన అనంతరం కాంగ్రెస్ రైతు సమస్యలపై చర్చించింది. విఖే పాటిల్ మాట్లాడుతూ.. తీవ్ర కరువు, అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
దీనిపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రుణమాఫీ ఒక్కటే రైతుల సమస్యలకు పరిష్కారం కాదని చెప్పారు. రుణమాఫీ సాధ్యంకాదని తాను చెప్పలేదన్నారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ.. రైతుకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. విత్తనాలు విత్తి ఇరవై ఐదు రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో వర్షాల జాడలేదని ఆవేదన వ్యక్తం చే శారు. రైతులు మళ్లీ విత్తానాలు విత్తుకోవాల్సి ఉంటుందన్నారు. రూ. 3000 కోట్లు రాబట్టుకోవడం కోసం ఎల్జీటీ, టోల్ అనుబంధ డిమాండ్లను విధించింద ని విమర్శించారు.
సమస్యలను పక్కదారి పట్టించేందుకే
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్చ జరగ కుండా ఉండేందుకు ఓ వ్యూహాత్మక అవగాహనతో బీజేపీ, ఎన్సీపీలు సభ వాయిదావేసేలా ప్రవర్తిస్తున్నారని ఓ శివసేన విమర్శించారు. రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించేంతవరకు సభా కార్యక్రమాలు జరగనివ్వమని ఎన్సీపీ ఆందోళన చేయడంలో అర్థం లేదని పేర్కొన్నారు. రుణమాఫీపై సీఎం తన మాటలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని, రుణమాఫీ కోసం ప్రకటించడం కోసం ఆందోళన చేపట్టడంలేదని దుయ్యబట్టారు. ఇతర సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలా ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు.
అవినీతి ఆరోపణలపై మండలి చైర్మన్ విచారణకు ఆదేశిస్తే.. నిర్దేశించిన సమయంలోపు ప్రభుత్వం నివేదిక సమర్పిస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీతో శివసేనకు వైరం పెంచేందుకు ఎన్సీపీ సభా కార్యక్రమాలను అడ్డుకుంటోదని ఆరోపించారు. మొత్తం 63 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది గ్రామీణ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలని, ఈ ఎమ్మెల్యేలంతా రుణమాఫీ అంశాన్ని ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారన్నారు. రుణ మాఫీ అంశంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకొని ఎన్సీపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీకి శివసేన ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఉపసంహరించుకోదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సభా కార్యక్రమాలు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. తమ నియోజకవర్గాలకు వెళ్లినపుడు అక్కడి ప్రజలకు వారు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.