భూ యజమానుల కొమ్ముకాస్తున్న సర్కారు
► కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి
► పండించేవారికే రుణాలు మంజూరు చేయాలి
► ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ నేత రంగారావు
విజయవాడ(భవానీపురం): పంటలు పండించే కౌలు రైతులను విస్మరించి భూ యజమానులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రంగారావు విమర్శించారు. 2011 కౌలుదారుల చట్టం ప్రకారం కౌలుగుర్తింపు కార్డులు, పంట రుణాలు, ఇన్‌పుట్స్, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం, రుణమాఫీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, దేవాలయ కౌలురైతుల కౌలురద్దు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం చలో విజయవాడ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, సాగుభూమిలో 70 శాతం భూమిని కౌలురైతులే సాగుచేస్తున్నారని తెలిపారు. ఎన్నికలముందు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలిచ్చి, రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని వాగ్దానం చేసిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. గతేడాడా ది పంటరుణాల కోసం కేటాయించిన రూ.59వేల కోట్లలో, రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ రికార్డుల ప్రకారం కౌలురైతులకు ఇచ్చింది కేవలం రూ.218 కోట్లేనని పేర్కొన్నారు.
గుర్తింపు కార్డులు 16.5 లక్షల మందికి ఇవ్వాలన్నది లక్ష్యంకాగా కేవలం 4లక్షల మంది కి మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. ఇందులో 95వేల మందికి పంట రుణాలిచ్చారని, మిగిలిన రుణాలన్నీ భూస్వాములకు, భూయజమానులకు ఇచ్చారని చెప్పారు. రుణమాఫీలో 2.50లక్షల మంది కౌలు రైతులకు సంబంధించి రూ.570 కోట్లలో సగం మాత్రమే రద్దు చేశారని తెలిపారు. దీంతో కౌలు రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని సాగుచేస్తున్నారని చెప్పారు.
నష్టపరిహారంపై చిత్తశుద్ధి లేదు
సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కరువు వల్ల పెట్టుబడులు పెట్టిన కౌలురైతులు నష్టపోయారన్నారు. పత్తి ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గిందని చెప్పారు. పత్తికి కనీస మద్దతు ధర దక్కలేదన్నారు. మిర్చి, మినుము పంటలకు తెగుళ్లు సోకి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మార్కెట్‌లో ధరలు లేక కౌలు రైతులు తీవ్రనష్టాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. సభ అనంతరం ర్యాలీగా బయలుదేరి అలంకార్ సెంటర్‌కు చేరుకున్నారు.
వినతి పత్రం స్వీకరించిన డీడీఏ
అలంకార్ సెంటర్‌కు చేరుకున్న కౌలు రైతుల నుంచి వ్యవసాయ శాఖ డెప్యూటీ డెరైక్టర్ బాలూనాయక్ వినతి పత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా డీడీఏ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు తాను వచ్చానని, మీ సమస్యలను తమ శాఖ డెరైక్టర్ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ఆయన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తారని చెప్పారు.