విడతల వారీగానే రుణమాఫీ..! | the phase-wise Loan waiver ..! | Sakshi
Sakshi News home page

విడతల వారీగానే రుణమాఫీ..!

Published Tue, Mar 15 2016 2:14 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

విడతల వారీగానే రుణమాఫీ..! - Sakshi

విడతల వారీగానే రుణమాఫీ..!

వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అంగీకరించని ప్రభుత్వం
జాప్యంపై రైతుల్లో అసహనం
రెండేళ్లుగా మాఫీ లెక్కలతో సాగు సమయానికి అందని రుణాలు
వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్న వైనం
 

 
 ఆదిలాబాద్ అగ్రికల్చర్ : అసలే ప్రకృతి దోబూచులాటలతో కుదేలవుతున్న అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వమూ మొండికేస్తోంది. రుణమాఫీని ఒకేసారి మాఫీ చేయకుండా గతేడాది మాదిరి పాటే పాడింది. మిగిలిన 50 శాతం రుణమాఫీ ఈసారైనా ఒకేసారి అవుతుందని ఆశపడ్డ రైతులకు భంగపాటే తప్పలేదు. ఈసారీ 25 శాతం వారీగా రెండు విడతల్లోనే మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు అసహనంతో ఉన్నారు. ప్రభుత్వం ఇలా విడతల వారీగా రుణమాఫీ చేయడంతో తమకు ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 నెలల తరబడి ఆలస్యం..
జిల్లాలో రెండేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీతో రైతులకు ప్రయోజనం చేకూరడం లేదు. 2014 నుంచి విడతల వారీగా రుణమాఫీ అందిస్తుండడం.. మాఫీ సొమ్మును ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించడంలో ఆలస్యం జరుగుతుండడం.. వెరసి రైతులకు సమయానికి బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. మాఫీ లెక్కలతో రైతులకు ఇవ్వడంలో బ్యాంకర్లు నెలల తరబడి ఆలస్యం చేస్తున్నారు. రుణమాఫీని 25 శాతం చొప్పున ఇదివరకు రెండు విడతలుగా 50 శాతం బ్యాంకులకు చెల్లించింది. మిగిలిన 50 శాతాన్ని ఒకేసారి చెల్లించి ఖరీఫ్ సమయానికి సకాలంలో రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలించలేదు. నాలుగు విడతల్లో భాగంగా ఈ ఏడాది కూడా మూడో విడతగా 25 శాతం చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రెండేళ్లుగా బ్యాంకు రుణాలు వర్షాలు మొదలై పంటలు విత్తుకునే గడువు దాటిపోతున్నా అందడం లేదు. ఫలితంగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు.

మాఫీ వస్తేనే కొత్త రుణం..
ప్రభుత్వం రుణాల మాఫీ సొమ్మును అందిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని రెండేళ్లుగా బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. మొదటి విడత రుణమాఫీ సొమ్మును 2014లో సెప్టెంబర్‌లో చెల్లించింది. దీంతో రైతులకు అక్టోబర్ నుంచి రుణాలు అందాయి. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతులపై రుణమాఫీపై మరో తిరకాసు పెట్టింది. తొలివిడత విడుదల చేసిన రుణమాఫీ సొమ్ము అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయో లేదో తేల్చాకే మలివిడత డబ్బులు విడుదల చేస్తామంది. తొలివిడిత 25 శాతం రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) ఇచ్చినా ప్రభుత్వం సంతృప్తి చెందలేదు.

దీనిపై మరోసారి విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా జిల్లాలో 5 టీంలను నియమించింది. ఈ టీంలో ఒక రాష్ట్రస్థాయి అధికారి, ట్రెజరర్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారి మొత్తం ఐదుగురు అధికారులతో విచారణ చేపట్టి జూన్ నెల 30వ తేదీ వరకు కలెక్టర్‌కు నివేదిక అందించింది. దీంతో రెండో విడత సొమ్ము జూలైలో బ్యాంకులకు అందింది. ఈ కారణంగా పంటల కాలం సగం గడిచిపోయే సరికి రుణాలు ఇవ్వలేదు.


 రెండు విడుతల్లో డబ్బులు విడుదల..
జిల్లాలో లక్షలోపు రుణమాఫీ పథకం కింద 3.17 లక్షల మంది రైతులు అర్హులుగా గుర్తించారు. రూ.1,400 కోట్లను విడతల వారీగా అమలు చేస్తోంది. ఇందులో 25 శాతం కింద 2014లో రూ.387 కోట్లు బ్యాంకర్లుకు అందించింది. కాగా.. రీ షెడ్యూల్ చేసుకున్న రైతులు 3 లక్షల 9 వేల 24 మంది ఉన్నారు. వీరికి రూ.365 కోట్ల 53 లక్షలు జమ చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక అందించారు. మిగతా సొమ్మును తిరిగి వెనక్కి పంపించారు. రెండో విడతగా 25 శాతం ద్వారా రూ.365 కోట్ల 53 లక్షలు కేటాయించగా.. ప్రభుత్వం వీటినీ రెండు విడతలుగా విడుదల చేసింది.

 అన్నదాతల్లో ఆసహనం..
రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడంపై జిల్లాలో అన్నదాతల్లో అసహనం వ్యక్తమైంది. ఖరీఫ్ ప్రారంభమై నెలలు గడిచినా కొత్త రుణాలు అందకపోవడంతో పెట్టుబడికి ఎదురుచూపులు తప్పలేదు. దీంతో వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెట్టారు. ఖరీఫ్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడులు పడిపోయి నష్టాలు ఎదుర్కొన్నారు. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేక మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. మిగిలిన బాకీని అయినా ఒకేసారి మాఫీ చేసి.. ఈ ఏడాదైనా నైరుతి రుతుపవనాలు ప్రవేశించే సమయానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం విడతల వారీగానే అని ప్రకటించడంతో వారు నిరాశలో ఉన్నారు.

 పెట్టుబడులు భారం..
రెండేళ్లుగా పంట రుణాలను బ్యాంకర్లు సకాలంలో అందివ్వకపోవడంతో వడ్డీ వ్యాపారులు ఇదే అదునుగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. దిగుబడి రాక తీసుకున్న అప్పుకు 20 శాతం వడ్డీ చెల్లించక తప్పడం లేదు. ఖరీఫ్ సీజన్ నుంచి జిల్లావ్యాప్తంగా రూ.400 కోట్ల వరకు ప్రైవేటు వడ్డీ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది.
 
 రైతులు నష్టపోతున్నారు..
రెండేళ్లుగా సాగు సమయానికి రుణాలు అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ రుణామాఫీ విడతల వారీగా అమలు చేస్తూ లాభం కన్నా రైతులకు నష్టమే చేస్తంది. సకాలంలో అందక నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కరువుతో కొట్టుమిట్టాడుతున్న రైతులు దిగుబడి రాక తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారు. మిగిలిన 50 శాతాన్ని ఒకేసారి మాఫీ చేసి ఖరీఫ్ ఆరంభానికి ముందే కొత్త రుణాలు అందించాలి. - ముడుపు ప్రభాకర్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు,
 ఏఐకేఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement