♦ ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
♦ చేనేత రంగంపై నిర్లక్ష్యానికి నిరసనగా విపక్షం వాకౌట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత రుణాలు మాఫీ కాకపోవడంతో చాలా మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, స్వయానా తానే వెళ్లి 12 కుటుంబాలను పరామర్శించి వచ్చానని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2015-16 బడ్జెట్‌లో కేటాయించింది రూ.135 కోట్లు అంటున్నారు, కేంద్రం రూ.15.72 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. కానీ రూ.110 కోట్లతో 25 వేల మందికి రుణాలు మాఫీ చేసి.. చేనేత కార్మికుల రుణమాఫీ పూర్తయిందని చెబుతున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయం రంగం తర్వాత చేనేత రంగమే రెండో అతిపెద్ద రంగం. ధర్మవరంలో రుణమాఫీ కాక చేనేత కార్మికులకు చనిపోతే, 12 మంది ఇంటికి పోయి వాళ్ల గాథలు విన్నాను. వారెవ్వరికీ రుణాలు మాఫీ కాలేదు..’ అని వై.ఎస్. జగన్ చెప్పారు. కార్మికులకు సబ్సిడీ కూడా రావడం లేదన్నారు. అంతటి దారుణమైన పరిస్థితుల్లో చేనేత కార్మికులు విలవిల్లాడుతుంటే.. రూ.110 కోట్లు చేనేత రుణమాఫీకి వెచ్చించి, 25 వేల మందికి రుణమాఫీ చేశాం.. ఇంతటితో అయిపోయిందని ప్రభుత్వం చెబుతోందని విపక్ష నేత ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు.
ప్రభుత్వం చోద్యం చూస్తోందా?: మోదుగుల
చేనేతలకు సంబంధించిన 11 ఉత్పత్తులను నేతన్నలు మినహాయించి ఎవరూ తయారు చేయకూడదని కేంద్రం ఆదేశాలున్నా పవర్‌లూమ్స్ తయారు చేస్తోంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందా అని తెలుగుదేశం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. చేనేతల పొట్టకొట్టవద్దని సూచించారు.
నేతన్నల ఆత్మహత్యలు కనిపించలేదా?
Published Wed, Mar 16 2016 2:27 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement