లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ దృష్టి
Published Sat, Dec 28 2013 12:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ నాయకులు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో అధికారం వచ్చినట్టే వచ్చి చేజారడంతో ఈసారి జరిగే లోక్‌సభ ఎన్నికలకు పక్కా ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్‌తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీపరంగా పనులను ముమ్మరం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కార్యకర్త సమ్మేళనాలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
‘వోట్ ఫర్‌మోడీ, వోట్ ఫర్ స్ట్రాంగ్ ఇండియా’ నినాదంతో జనంలోకి వెళ్లనున్నట్టు తెలిపారు. ఇప్పటికే పార్టీ తరఫున ఠీఠీఠీ.జీఛీజ్చీ272.ఛిౌఝ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. 0782007820 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా మద్దతు తెలపవచ్చన్నారు. మోడీ నేతృత్వంలో గుజరాత్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించే సమాచార కిట్లను నగరవ్యాప్తంగా పంచనున్నట్టు గోయల్ చెప్పారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మహిళలు, యువత లక్ష్యంగా మహిళా సమ్మేళనాలు, యువ సమ్మేళనాల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించేందుకు చింతన్ శిబిర్‌ను జనవరి లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తాల్‌కటోరా స్టేడియంలో శనివారం నిర్వహించనున్న ‘అభినందన్ ర్యాలీ’లో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నాయకులు సుష్మాస్వరాజ్,అరుణ్‌జైట్లీ, ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జీ నితిన్ గడ్కరీ, కో-కన్వీనర్ నవజ్యోతిసింగ్ సిద్ధూ తదితరులు పాల్గొంటారని గోయల్ తెలిపారు.
Advertisement