దినకరన్‌కు మరో షాక్...
న్యూఢిల్లీ: ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిన టీటీవీ దినకరన్‌కు మరో షాక్. ఆయనకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముందస్తుగా లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. దినకరన్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో ఆయన ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఈ కేసు విచారణ జరుపుతున్న ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ... ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని దినకరన్‌ను అరెస్ట్ చేస్తామని, ఇప్పటికే విచారణ నిమిత్తం సమన్లు జారీ చేశామన్నారు. అలాగే దినకరన్‌తో సుకేశ్ చంద్రశేఖర్‌కు ఉన్న సంబంధాలపై తాము ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సుకేశ్‌ను అరెస్ట్ చేసిన రోజు కూడా అతడు...దినకరన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. సుకేశ్‌కు గత నాలుగేళ్లుగా దినకరన్ తెలుసని తమ విచారణలో తేలిందన్నారు. వీరిద్దరు పలు సందర్భాల్లో కలుసుకున్నారన్నారు.
కాగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడం వల్ల కోల్పోయిన రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీటీవీ దినకరన్ చేసిన ప్రయత్నాలు ఆయనను నిందితుడిగా మార్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్లు లంచం ఇవ్వడం ద్వారా రెండాకుల చిహ్నాన్ని పొందడం కోసం కర్ణాటకకు చెందిన సుకేశ్ చంద్రశేఖర్ అనే బ్రోకర్‌ను ఆశ్రయించడం, అతడిని ఢిల్లీ పోలీసులకు సోమవారం పట్టుబడడంతో దినకరన్ బండారం బట్టబయలైంది. దినకరన్ ఇచ్చాడని చెబుతున్న రూ.1.30 కోట్లను సుకేష్ గది నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దినకరన్‌ను విచారించేందుకు అనుమతి పొందిన ఢిల్లీ పోలీసులు చెన్నైకి వచ్చి ఆయనను ఏక్షణమైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఢిల్లీ పోలీసులు సుకేష్‌ను వెంట పెట్టుకుని బుధ, గురువారాల్లో చెన్నైకి చేరుకుంటారని తెలుస్తున్న నేపథ్యంలో దినకరన్ తన న్యాయవాదులతో మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.