ఊబకాయం.. నేడు ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య. మారుతున్న ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, శ్రమ ఎరుగని శరీరం.. ఇందుకు కారణాలని వైద్యులు చెబుతున్నారు.
ఊబకాయం.. నేడు ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య. మారుతున్న ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, శ్రమ ఎరుగని శరీరం.. ఇందుకు కారణాలని వైద్యులు చెబుతున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు కొందరు జిమ్‌లు, ఏరోబిక్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరు వ్యాపార ప్రకటనలను చూసి మందులు వాడి మోసపోతుంటారు. ప్రకృతి సిద్ధమైన విధానాలతో, ఎటువంటి మందుల పనిలేకుండా ఇళ్లలోనే ఉండి శరీరంలో కొవ్వును తగ్గించుకోవచ్చని యోగా, నేచురోపతి నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి సిద్ధమైన విధానంలో కొవ్వును తగ్గించుకునే విధానాలను ఇలా వివరిస్తున్నారు.
శరీరంలో కొవ్వు పేరుకుపోవటం వల్ల అనేక అనర్ధాలు వస్తాయి. సన్నగా కనిపిస్తున్నా కూడా కొందరిలో కొవ్వు పేరుకుపోయి ఉండి వ్యాధులకు గురవుతుంటారు. శరీరానికి కొవ్వుకూడా కొంతమేర మాత్రమే అవసరం. అధికమైతేనే అనర్థాలు వస్తాయని డాక్టర్ ఉమాసుందరి వెల్లడించారు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరా తగ్గటం వల్ల గుండెపోటు, పక్షవాతం లాంటి జబ్బులు వచ్చి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మన దినచర్య, తీసుకునే ఆహారం, శారీరక శ్రమ లేకపోవటం, మానసిక ఒత్తిడి వల్ల కొవ్వు పేరుకుపోతుందన్నారు.
కొవ్వును తగ్గించవచ్చు...
శరీరంలోని ఎలాంటి జబ్బులనైనా 70 శాతం ఆహారంతో తగ్గించవచ్చు. తినే ఆహారం కొంచెమైనా అందులో పోషక విలువలు ఉండాలి. పండ్లరసాలు, కాయగూరల రసాలు, పండ్లు, ఉడకబెట్టిన ఆహారం, ఉడకబెట్టని(రాఫుడ్) ఆహారంతో శరీరంలోని కొవ్వును తగ్గించవచ్చు.
వ్యాయామం ద్వారా 20శాతం జబ్బులను తగ్గించవచ్చు. యోగాతో కొవ్వును కరిగించవచ్చు.
శరీరంలో ఎంత కొవ్వు ఉంది, అది కరిగిపోవటానికి ఎంతసేపు, ఎలాంటి వ్యాయామం చేయాలనేది శిక్షకులను అడిగి తెలుసుకుని వారి పర్యవేక్షణలో వ్యాయామం చేయాలి.
దినచర్యల్లో మార్పు చేయటం ద్వారా 10శాతం కొవ్వును తగ్గించవ్చచ్చు. ముందు శరీరంలో ఉన్న బరువును తగ్గించుకుని భవిష్యత్తులో పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
బరువు పెరిగేందుకు కారణాలు...
ఇళ్లలో వంట చేయటం తగ్గించి నేడు చాలా మంది హోటళ్లు, రెస్టారెంట్లలో రెడీమేడ్ ఫుడ్‌లపై మోజు చూపించటం బరువు పెరిగేందుకు కారణమవుతోంది.
ఎక్కువ చిన్నపిల్లలు చిరుతిళ్లుగా రెడీమేడ్ ప్యాకెట్స్‌లో ఉంచిన ఆహారాన్ని అధికంగా తీసుకుంటూ బరువు సమస్యను
ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినటం కూడా ఒక కారణం.
కంటికి సరిపడా నిద్రపోకుండా, మానసిక వత్తిడికి గురవ్వటంతో బరువుపెరుగుతున్నారు.