ఢిల్లీలో రాజకీయ అనిశ్చితిపై కమలదళం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ విషయంపై స్పష్టత రానుంది. దేశవ్యాప్తంగా తమ పార్టీకి చక్కని ఆదరణ ఉందని, తాజా ఎన్నికలకు తాము సిద్ధమేనని, ఈ విషయంలో జంకుతున్నామంటూ ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలను రాష్ర్ట శాఖ కొట్టిపారేసింది.
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఢిల్లీలో రాజకీయ అనిశ్చితిపై కేంద్రంతోపాటు తమ పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తాజా ఎన్నికల విషయంలో తమ పార్టీ పలాయనం చిత్తగిస్తోందంటూ కాంగ్రెస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఎన్నికలకు తమ పార్టీ అన్నివిధాలుగా సిద్ధంగానే ఉందన్నారు. ‘దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు తమ పార్టీపై సంపూర్ణ విశ్వాసం ఉంది. మహారాష్ర్టలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే ఢిల్లీ విషయంలో తమ పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుంది. రాజకీయ అనిశ్చితికి త్వరలోనే తెరపడుతుతుంది’ అని అన్నారు. మూడు శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల తేదీలను ప్రకటించడమంటే తాము తాజా ఎన్నికలకు దూరంగా జరుగుతున్నామని కాదన్నారు.
మెజారిటీ తథ్యం
శాసనసభ ఎన్నికలు జరిగితే తమకు స్పష్టమైన మెజారిటీ రావడం తథ్యమన్నారు. మూడు శాసనసభ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగడమనేది అనివార్యమని, అది రాజ్యాంగబద్ధ అవసరమని సతీష్ పేర్కొన్నారు. వీటి ఫలితాలు ఢిల్లీ శాసనసభ ఎన్నికలపై ఉండబోవన్నారు. తాము ఎన్నికలకు అన్నివిధాలుగా సిద్ధంగానే ఉన్నామని, తమపై మాటిమాటికీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలే ఎన్నికలకు సన్నద్ధంగా లేవన్నారు.
ప్రజాదరణకు అవే రుజువులు
హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తమ పార్టీకి ఉన్న ఆదరణకు రుజువులని సతీష్ పేర్కొన్నారు. ఢిల్లీలోనూ అదే జరుగుతుందనే విశ్వాసం తమకు ఉందన్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ అనుకూలంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయమై అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ తమను ఆహ్వానించినా తిరస్కరిస్తామన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే ఢిల్లీలో రాజకీయ అనిశ్చితిపై నిర్ణయం
Published Sun, Oct 26 2014 9:58 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement