లోకల్ రైలు ప్రమాదంలో దురదృష్టవశాత్తు రెండు చేతులు కోల్పోయిన మోనికా మోరేకు రూ. అయిదు లక్షల నష్టపరిహారాన్ని రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
సాక్షి, ముంబై: లోకల్ రైలు ప్రమాదంలో దురదృష్టవశాత్తు రెండు చేతులు కోల్పోయిన మోనికా మోరేకు రూ. అయిదు లక్షల నష్టపరిహారాన్ని రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ముంబై పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఆమెను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆయా స్టేషన్లలో తక్కువ ఎత్తు ఉన్న ప్లాట్ ఫారాల ఎత్తును పెంచుతామని ఖర్గే హామీ ఇచ్చారు. ఇప్పటివరకు కొన్నిచోట్ల ప్లాట్‌ఫారాల ఎత్తు పెంపు పనులు జరుగుతున్నాయని, మరో 74 ప్లాట్‌ఫారాల ఎత్తు పెంచాల్సి ఉందని ఆయన తెలిపారు.
కుర్లాలో నివసించే మోనికా, ఘాట్కోపర్‌లోని ఎస్టీ మెహతా వుమెన్స్ కాలేజీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఘాట్కోపర్‌లో రైలు ఎక్కుతుండగా ప్లాట్‌ఫారం ఎత్తు తక్కువగా ఉండడం, రైలు, ప్లాట్‌ఫారం మధ్య గ్యాప్ (వ్యత్యాసం) అధికంగా ఉండడంతో అందులో పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డా రెండు చేతులనూ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అనంతరం ప్లాట్‌ఫారం, రైలు ఎత్తు, గ్యాప్ విషయమై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలు సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఆయన మోనికా మోరేకు రూ. అయిదు లక్షల నష్టపరిహారం ప్రకటించారు.
మంత్రి వ్యాఖ్యలపై మండిపాటు
ముంబై పర్యటన సమయంలో రైల్వే ప్రయాణికుల నుద్దేశించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఖార్గే మాట్లాడుతూ.. రైల్వేల గురించి తరచూ ఫిర్యాదులు చేసేవారికి రైలు ప్రయాణం అంతకష్టంగా అనిపిస్తే.. బస్సుల్లో ప్రయాణించవ చ్చుకదా..’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నగరంలో గురు,శుక్రవారాల్లో రైల్వే మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైల్వేలో ప్రయాణికుల సమస్యలు, భద్రత తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. లోకల్ రైళ్లలో ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారుతోందని ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘ ముంబై లోకల్ రైళ్లలో రోజూ కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు. దీంతోవాటిపై తీవ్ర భారం పడుతోంది. ఈ సమయంలో జరిగే చిన్నచిన్న తప్పిదాలను పెద్దవిగా చూపిస్తూ తరచూ ఫిర్యాదులు చేయడం సరికాదు.. ఎవరికైనా వాటిలో వెళ్లడం కష్టమనిపిస్తే బస్సుల్లో వెళ్లాలని ఖర్గే సూచించడంతో అక్కడ ఉన్నవారందరూ అవాక్కయ్యారు.
ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం కల్యాణ్- ఠాణే- లోకమాన్య తిలక్ టెర్మినస్ విభాగంపై డీసీ-ఏసీ ట్రాక్షన్ కన్వెర్షన్‌ను రైల్వే మంత్రి ఖర్గే జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ముంబై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే నాలుగు సూపర్‌ఫాస్ట్/మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.