సల్మాన్ కేసులో అనేక అనుమానాలు
- కమాల్ వాంగ్మూలంలో కీలక అంశాలు
- సల్మాన్ ఇరకాటంలో పడే అవకాశం
సాక్షి, ముంబై: హిట్ అండ్ రన్ కేసులో మరో ప్రత్యక్ష సాక్షి, గాయకుడు కమాల్ ఖాన్ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన వాంగ్మూలంలో అనేక కీలక అంశాలు వెలుగుచూశాయి. సల్మాన్ ఖాన్‌కు బెయిల్ లభించడంలో కీలక పాత్ర పోషించిన డిఫెన్స్ లాయర్ కమాల్ ఖాన్ ఎందుకు విచారించలేదని, ఆయన సాక్ష్యం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
అయితే ముంబై పోలీసుల వద్ద కమాల్ ఖాన్ చెప్పిన సాక్ష్యం ఉందని తెలిసింది. ముంబై పోలీసులకు కమాల్ ఖాన్ లిఖిత పూర్వకంగా తెలిపిన వివరాల్లో అనేక విషయాలు భిన్నంగా ఉన్నాయి. ఆయన చెప్పిన సాక్ష్యంతో సల్మాన్ ఖాన్ ఇరకాటంలో పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సల్మాన్‌తోపాటు బాడీగార్డు రవీంద్ర పాటిల్, తాను ఉన్నానని కమాల్ పేర్కొన్నారు.
కారు నడిపింది సల్మాన్: కమాల్
‘2002 సెప్టెంబరు 27న రాత్రి నేను సల్మాన్ కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లాను. అక్కడ డిన్నర్ చేయాలన్న ప్లాన్ చేశాం. సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన బాడిగార్డు, నేను ల్యాండ్ క్రూజర్ కారులో జుహూ నుంచి రైన్ హోటల్ కు వెళ్లాం. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహెల్‌తోపాటు బాడిగార్డు మరో కారులో అక్కడికి వచ్చారు. రాత్రి 11 గంటలకు అక్కడికి చేరాం. సల్మాన్,సోహైల్, నేను సర్వీసు కౌంటర్ వద్ద స్నాక్స్ తీసుకున్నాం. రెండు గంటల తర్వాత మేము తెలుపు రంగు ల్యాండ్ క్రూజర్ కారులో జెడబ్ల్యూ మెరియట్ హోటల్‌కు చేరుకున్నాం. అక్కడ కొంతసేపు ఉన్నతర్వాత అక్కడి నుంచి బయలుదేరాం.
సల్మాన్ ఖాన్ డ్రైవ్ చేయసాగాడు. ఆయన పక్కన సీట్లో బాడిగార్డు కూర్చున్నాడు. నేను డ్రైవర్ వెనుకాల సీట్లో కూర్చున్నాను. మేము ఇంటివైపు వెళ్తూ ఉన్నాం. సెయింట్ అండ్రూస్ రోడ్డుపై నుంచి హిల్ రోడ్డు వరకు వచ్చాం. అక్కడ ఓ రైట్ టర్న్ తీసుకుంటుండగా సల్మాన్ కారు కంట్రోల్ కాలేదు. కారు ఓ భవనం వద్ద ఫుట్‌పాత్‌పైకి ఎక్కి భవనంలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అరుపులు విన్నాం. కారు దగ్గర ప్రజలు గుమిగూడారు. సల్మాన్ బయటికి రా అంటూ కొందర అరుస్తున్నారు. కొందరు గాయలైనవారికి సాయం చేస్తున్నారు. ఎప్పుడైతే మేము కారులో నుంచి దిగామో అప్పుడు కొందరు మా వద్దకి వచ్చి తోయసాగారు.
సల్మాన్ ఖాన్ బాడిగార్డు అక్కడున్నవారికి నేను పోలీసునని చెప్పడంతో జనం కొంత శాంతించారు. ఈ సమయంలో నా సెల్ ఫోన్ కిందపడిపోయింది. నేను సల్మాన్ ఖాన్ ఇంటివైపు పరుగెత్తి వాచ్‌మెన్‌ను పిలిచాను. సల్మాన్ ఖాన్ కారు ప్రమాదానికి గురైందని సోహెల్ ఖాన్‌కు ఫోన్ చేయమని చెప్పాను. సోహెల్ ఖాన్‌కు ఈ విషయం చెప్పిన అనంతరం నేను కొంత సమయం వాచ్‌మెన్ కుర్చీలో కూర్చున్నాను. అనంతరం నేను ఇంటికి ఆ తర్వాత అక్కడి నుంచి లోనవాలా వెళ్లాను.’ అని కమాల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
బెయిల్‌పై అనేక అనుమానాలు
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెయిల్ లభించిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెయిలు మంజూరుకోసం కారణాలను ృసష్టించారా అనే అనుమానాన్ని ముంబై సేషన్స్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది ప్రదీప్ ఘరాత్ వ్యక్తం చేశారు. ముంబై సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు కాపీ అందకపోవడంతో తాత్కాలికంగా రెండు రోజుల బెయిల్‌ను హై కోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
కాని ముంబై సేషన్స్ కోర్టు న్యాయమూర్తి దేశ్‌పాండే ప్రకటించిన తీర్పును టైప్ చేసే సమయంలో కోర్టులో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ప్రదీప్ ఘరాత్ మీడియాకు తెలిపారు. సల్మాన్ ఖాన్ కేసులో తీర్పును టైప్ చేసే సమయంలో రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. ముంబైలో సాధారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అరుదని అన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీర్పును టైప్ చేయడంలో జాప్యమయిందని, తద్వారా బెయిల్ లభించేందుకు సల్మాన్ ఖాన్‌కు అవకాశం లభించిందని ఘరాత్ చెప్పడం విశేషం.