బ్లూవేల్‌ భూతం! | MBA student hangs himself in Puducherry, Blue Whale Challenge suspected | Sakshi
Sakshi News home page

బ్లూవేల్‌ భూతం!

Published Sat, Sep 2 2017 7:13 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

బ్లూవేల్‌ భూతం! - Sakshi

బ్లూవేల్‌ భూతం!

పుదుచ్చేరిలో విద్యార్థి ఆత్మహత్య
కోవై, నెల్లై ఆస్పత్రుల్లో మరో ఇద్దరు
ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్లతో అరచేతుల్లో ప్రాణాంతక క్రీడ
బ్లూవేల్‌ ఉచ్చులో పదివేల మంది యువత
తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త


‘బ్లూవేల్‌’. దేశ ప్రజలను తీవ్రంగా భయపెడుతున్న మూడుఆన్‌లైన్‌ క్రీడాక్షరాలు ఇవి. ‘నీవు చనిపో లేకుంటే మీకుటుంబంలోని వ్యక్తిని మేమే చంపేస్తాం’ అనే సందేశాలనుఅందుకున్న భయంతో బ్లూవేల్‌ ఛాలెంజ్‌ ఆన్‌లైన్‌ క్రీడ మోజులోఅశువులుబాస్తున్నారు. మదురైకి చెందిన విఘ్నేష్‌ అనే డిగ్రీ విద్యార్థి బ్లూవేల్‌ క్రీడలో బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మొత్తం రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఈ షాక్‌ నుంచి కోలుకోక ముందేపుదుచ్చేరిలో ఎంబీఏ విద్యార్థి శశి హంబాబోరీ గురువారం రాత్రిఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లూవేల్‌ ఛాలెంజ్‌ గేమ్‌ అంటే ఏమిటి, తమిళనాడులో దాని ప్రభావం.. వివరాలు ఇలా ఉన్నాయి.

సాక్షి ప్రతినిధి, చెన్నై:  రష్యాలో పుట్టి ఐరోపా, అమెరికా ఖండాంతరాలను దాటి తమిళనాడులోకి ప్రవేశించి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడువేల మందిని పొట్టనపెట్టుకుంది బ్లూవేల్‌. ఆన్‌లైన్‌ గేముల అలవాటున్న యువత, విద్యార్థులు బ్లూవేల్‌ ఛాలెంజ్‌ గేమ్‌ ఊబిలోకి దిగుతున్నారు. బ్లూవేల్‌ క్రీడతో ఆత్మహత్యకు పురిగొల్పుతున్న నేరానికి రష్యాకు చెందిన 17 ఏళ్ల బాలికను ఆ దేశ పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారంటే ఈ రాక్షస క్రీడలోని తీవ్రత తెలుసుకోవచ్చు. గేమ్‌లోని ప్రమాద తీవ్రత దృష్ట్యా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులో ఉండే ఈ క్రీడలోకి యువత ఆదే ఉత్సాహంతో దిగుతున్నారు.  ఈ వరుసలో మదురైకి చెందిన విఘ్నేష్‌ ఈ క్రీడకు బానిసగా మారి 19 ఏళ్లకే రెండు రోజుల క్రితం ప్రాణాలు వదిలాడు.

50 రోజుల పాటు కొనసాగే ఈ క్రీడలో రోజుకొక టాస్క్‌ను ఇస్తారు. ఈ బ్లూవేల్‌లో 50 టాస్క్‌లు ఉంటాయి. ఈ సమయంలో బ్లూవేల్‌ నిర్వాహకుల వైపు నుంచి ఏదో ఒక సందేశం వస్తుంది. అందులో చేతి మీద బ్లేడుతో మూడు సార్లు కోసుకొని ఆ ఫొటోను పంపాలని, అలాగే తెల్లవారుజామున మిద్దెపైకి వెళ్లి అక్కడి ఏదో ఒక భయంకరమైన సన్నివేశాన్ని ఫొటో తీసి పంపాలని, అర్ధరాత్రి వేళల్లో శ్మశానాలకు వెళ్లాలని, తాము చెప్పిన వారికి సంబంధించిన నాలుగు గోడల మధ్య రహస్య సన్నివేశాల ఫొటోలను పంపాలని, వంటి టాస్క్‌లు ఇస్తారు. ఈ క్రీడలో 30వ టాస్క్‌ సమయంలో సదరు వ్యక్తి ఆత్మహత్య దశకు చేరుకుంటాడు. ఇవన్నీ తాను ఎందుకు చేయాలని నిర్వాహకులను నిలదీయగానే వారి వికృత భావాలను భయటపెడతారు.

క్రీడలోకి ఒక సారి వస్తే వెనుకకు వెళ్లడానికి వీలుకాని పరిస్థితులను కల్పిస్తారు. క్రీడాకారుని సెల్‌ఫోన్‌ను బ్లూవేల్‌ (అడ్మిన్‌) నిర్వాహకులు హ్యాక్‌ చేసి అన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇంత కాలంగా సెల్‌ఫోన్‌ ద్వారా చేసిన సంభాషణలు, చూసిన వెబ్‌సైట్‌లు, ఇతర గోప్యమైన వివరాలన్నీ నిర్వాహకులు తెలుసుకుని ఆ జాబితాను పంపుతారు. తాము చెప్పినట్టు చేయకుంటే ఈ విషయాలన్నీ బాహ్య ప్రపంచానికి చేరవేస్తామని భయపెడతారు. ఉదాహరణగా కొన్ని విషయాలను బయటపెడతారు. దీంతో భీతిల్లిన యువత తమ పరువు పోతుందనే ఆందోళనతో ఉరివేసుకోవడం తదితర ఆత్మహత్యలకు పాల్పడతారు. ఒంటరిగా, మానసిక న్యూనతకు లోనైన యువత ఎక్కువగా ఈ క్రీడ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇదేందో చూద్దాం అనే ఉత్సాహంతో బ్లూవేల్‌లోకి చొరబడి బయటకు రాలేకపోతున్నారు  వీరిలో అత్యధిక శాతం ఉన్నత విద్యావంతులు కావడం విషాదకరం.

పుదుచ్చేరి విద్యార్థి బలి
ఇదిలా ఉండగా,  అసోం రాష్ట్రం జామాజీ ప్రాంతానికి చెందిన రామ్‌కుమార్‌ బోరీ కుమారుడైన శశి హంబాబేరీ (21) పుదుచ్చేరి కాలాపట్టు యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వర్సిటీకే చెందిన హాస్టల్‌లోని ఒక పెద్ద హాలులో కొందరు విద్యార్థులతో కలిసి నాలుగు నెలలుగా ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడడం అతనికి హాబీ. యథాప్రకారం గురువారం రాత్రి తన తోటి స్నేహితులను బ్లూవేల్‌ ఛాలెంజ్‌ గేమ్‌కు పిలిచాడు. ప్రమాదకరమైన ఈ గేమ్‌ గురించి తెలిసిన ఇతర విద్యార్థులు అతనితో ఆడేందుకు నిరాకరించారు.

దీంతో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో  హాస్టల్‌ నుంచి వెళ్లిన శశి ఒంటరిగా కూర్చుని బ్లూవేల్‌ గేమ్‌ ఆడినట్లు తెలుస్తోంది. మరికొంత సేపటికి హాస్టల్‌ గదికి వచ్చి తన సెల్‌ఫోన్‌ను పెట్టి వెళ్లిపోయాడు. శశి ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెతుకుతూ వెళ్లిన విద్యార్థులకు హాస్టల్‌కు 50 మీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో వేప చెట్టుకు ఉరివేసుకుని శవంగా వేళాతుండగా గుర్తించారు. మృతుని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా బ్లూవేల్‌ వల్లనే శశి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు జరిపిన ప్రాథమిక  విచారణలో తేలింది. పోస్టుమార్టం తరువాత పూర్తి వివరాలు తెలుపుతామని పోలీసులు చెప్పారు.

రాష్ట్రంలో పదివేల మంది బ్లూవేల్‌ బాధితులు– ఆస్పత్రుల్లో మరో ఇద్దరు విద్యార్థులు:
గురు, శుక్రవారాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనల ఆధారంగా విచారణ చేపట్టిన సైబర్‌ క్రైం పోలీసులు రాష్ట్రంలో పదివేల మంది విద్యార్థులు బ్లూవేల్‌ గేమ్‌కు బానిసలుగా మారినట్లు గుర్తించారు. బ్లూవేల్‌ గేమ్‌ మోజులో పడి ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థులను శుక్రవారం సకాలంలో గుర్తించి ఆస్పత్రుల్లో చేర్పించారు. తిరునెల్వేలి జిల్లా వెల్లియూర్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి బ్లూవేల్‌ గేమ్‌లోకి దిగి ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో గుర్తించారు. అతని చేతిపై బ్లేడుతో గాట్లు, ఒంటి నిండా వాతలు పెట్టుకున్న గాయాలను గుర్తించి ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. జిల్లా ఎస్పీ అరుణ్‌శక్తి కుమార్‌ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.

అలాగే కోయంబత్తూరు జిల్లా కులియముత్తూరులోని ఒక ప్రయివేటు మెట్రిక్‌ స్కూల్‌ విద్యార్థి తన చేతిపై బ్లూవేల్‌ చిహ్నాన్ని చేతిపై బ్లేడుతో గీసుకుని ఉండడాన్ని గుర్తించిన పాఠాశాల యాజమాన్యం సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనికి కౌన్సిల్‌ ఇచ్చి పంపివేయగా, ఆన్‌లైన్‌ ఆటలో కొనసాగాలని బ్లూవేల్‌ నిర్వాహకుల నుంచి సదరు విద్యార్థికి బెదిరింపులు వస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ గేమ్‌లో ఏముందో అనే ఆసక్తితో దిగాం, ఆ తరువాత బైటకు రాలేకపోయామని బాధిత విద్యార్థులు పోలీసులకు వివరించారు. తన కుమారునితో 75 మంది విద్యార్థులు బ్లూవేల్‌ గేమ్‌ అడుతున్నట్లు తనకు తెలుసని మదురైలో గురువారం ఆత్మహత్యకు పాల్ప డిన విఘ్నేష్‌ తల్లి జయమణి మీడియాకు తెలిపారు.

విద్యాసంస్థల్లో హెచ్చరికలు:
బ్లూవేల్‌ క్రీడలోని ప్రమాదపు పోకడలను వివరిస్తూ, మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అనే సందేశంతో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో బోర్డులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశింది. విద్యార్థుల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని అన్ని జిల్లాల ఎస్పీలను డీజీపీ టీకే రాజేంద్రన్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement