‘భోజనం’ మిథ్య..! | mid day meal scheme in telangana | Sakshi
Sakshi News home page

‘భోజనం’ మిథ్య..!

Published Thu, Oct 20 2016 12:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

‘భోజనం’ మిథ్య..!

‘భోజనం’ మిథ్య..!

మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం
మెత్తని అన్నం.. నీళ్లచారే దిక్కు
అధికారుల పర్యవేక్షణ కరువు
టిఫిన్‌ బాక్సులు తెచ్చుకుంటున్న విద్యార్థులు 
 
ఆదిలాబాద్‌ టౌన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మిథ్యగా మారుతోంది. ఉడికీ ఉడకని.. మెత్తటి అన్నం, నీళ్ల చారుతో విద్యార్థులు కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు, స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలోని చాలా ఏజెన్సీలు మెనూ అమలు చేయడం లేదు. నీళ్లచారు, మెత్తటి అన్నంతో సరిపెడుతున్నారు. దీంతో సగం మంది విద్యార్థులు ఇంటి భోజనం చేస్తున్నారు. మరి కొంతమంది నాసిరకం భోజనం చేçస్తూ అవస్థలు పడుతున్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలల ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
 
జిల్లాలో..
ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 1,392 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక 984, ప్రాథమికోన్నత 173, ఉన్నత పా ఠశాలలు 228 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 96,035 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజన పథకం జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాల అన్నింటిలో అమలవుతోంది.
 
నాసిరకం భోజనమే  దిక్కు.. 
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయిస్తోంది. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ప్రతీ రోజు విద్యార్థులకు అన్నం, సాంబార్, పప్పు వండి పెట్టాలి. కానీ కొన్ని ఏజెన్సీలు కక్కుర్తితో టమాటా నీళ్ల చారు వడ్డిస్తున్నాయి. వారంలో మూడు సార్లు ఉడికించిన గుడ్డు ఇవ్వాల్సి ఉంది. చాలా పాఠశాలల్లో అమలు కావడంలేదు. వారంలో ఒక రోజు మాత్రమే గుడ్డు ఇస్తున్నారు. కొన్ని చోట్ల గుడ్లకు బదులుగా అరటి పండ్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలు మచ్చుకైనా కనిపించడం లేదు. సన్నరకం బియ్యం అయినప్పటికీ అన్నం మెత్తగా కావడంతో సగం మంది విద్యార్థులు తినలేకపోతున్నారు. ఇంటి నుంచి టిఫిన్‌ బాక్సులు తెచ్చుకుని పాఠశాలలో భోజనం చేస్తున్నారు. కొంతమంది ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వహకులతో కుమ్మక్కై భోజనం చేయని విద్యార్థుల డబ్బులు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
 
లోపించిన అధికారుల పర్యవేక్షణ..
ఏజెన్సీల నిర్లక్ష్యం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. విద్యార్థులకు మెరుగైన ఆహారం అందడం లేదు. ఆయా మండలాల్లోని పాఠశాలలను మండల విద్యాధికారులు నెల ఒకసారైనా తనిఖీ చేయాల్సి ఉండగా, చాలామంది ఎంఈవోలు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. వీరితోపాటు ఉప విద్యాధికారులూ తనిఖీ చేయాల్సి ఉండగా వారు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
 
మధ్యాహ్న భోజనం మెనూ..
వారం                                      భోజనం 
సోమవారం                               ఉడికించిన కోడిగుడ్డు, లేదా అరటి పండు, అన్నం, సాంబర్‌
మంగళవారం                            కూరగాయలతో భోజనం
బుధవారం                               అన్నం, పప్పు ఆకుకూరలతో భోజనం, ఉడి కించిన కోడిగుడ్డు
గురువారం                              సాంబార్‌ పప్పు భోజనం
శుక్రవారం                               కూరగాయాలతో భోజనం, ఉడికించిన కోడి గుడ్డు 
శనివారం                                పప్పు, కూరగాయలతో భోజనం
 
వారానికి ఒకసారే గుడ్డు
మధ్యాహ్న భోజనం నిర్వాహకులు వారానికి ఒక గుడ్డు మాత్రమే ఇస్తున్నారు. భోజనం బాగా పెట్టడం లేదు. నాణ్యమైన భోజనం పెట్టాలి. ఆకుకూరలు, కూరగాయలతో భోజనం పెట్టాల్సి ఉండగా కేవలం పప్పుతోనే సరిపెడుతున్నారు.
బ్రహ్మహిత, విద్యార్థి, బాలికల ఉన్నత పాఠశాల
 
ఇంటి నుంచి బాక్స్‌..
పాఠశాలలో భోజనం నాసికరంగా ఉండడంతో ఇంటి నుంచి టిఫిన్‌ బాక్స్‌ తెచ్చుకుని భోజనం చేస్తున్నాం. నీళ్లచారు, అన్నం మెత్తగా ఉంటుంది. అన్నంలో పురుగులు, రాళ్లు రావడంతో పాఠశాలలో తినడం మానేశాను. 
అనురాధ, ప్రభుత్వ బాలికల పాఠశాల, ఆదిలాబాద్‌
 
పకడ్బందీగా అమలు చేస్తాం
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేస్తా. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. వారానికి మూడు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాలి. కుకింగ్‌ కాస్ట్‌ కూడా పెరిగింది. నాణ్యమైన భోజనం పెట్టేవిధంగా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు పర్యవేక్షణ చేయాలి.
లింగయ్య,  డీఈవో 
 
పెరిగిన ‘భోజనం’ ధరలు
నేరడిగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం వ్యయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందిస్తున్న ఖర్చులపై ఏడు శాతం పెంచుతూ తెలంగాణ విద్యాశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని 1,392 పాఠశాలల్లో 90,035 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రాథమిక పాఠశాల్లో ఒక్కో విద్యార్థికి రూ.4.86 వెచ్చిస్తుండగా.. రూ.6.13 పైసలకు పెంచారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.6.78 నుంచి రూ.8.18 పైసలకు పెంచారు. 9వ, 10వ తరగతి విద్యార్థులకు కూడా 6.78 నుంచి రూ.8.18 పైసలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ధరలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో గత జూలై ఒకటి నుంచే వర్తిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిలో మధ్యాహ్న భోజనానికి నిధులు సమకూర్చుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్రం ఏడు శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 9, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. 
 
కొంత ఊరట
ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం బడ్జెట్‌ను పెంచడం కొంత ఊరట కలిగిస్తంది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రభుత్వం మరింత రేట్లు పెంచితే విద్యార్థులకు చక్కని భోజనాన్ని అందించవచ్చు.
పాల లసుంబాయి, వంట నిర్వాహకురాలు
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement