ముదురుతున్న ‘మిడ్‌నైట్ రైడ్’ వివాదం
Published Sun, Jan 19 2014 11:31 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
న్యూఢిల్లీ:ఆఫ్రికన్ జాతీయులపట్ల ఈ నెల 16న అర్ధరాత్రి కొందరు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కారకులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ చేతనాసింగ్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సోమనాథ్ భారతీతోపాటు కొందరు ఆప్ నేతలు గురువారం అర్ధరాత్రి దక్షిణ ఢిల్లీలో ఆఫ్రికన్ జాతీయులపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. కారకులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. భారత శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో సెక్షన్ 451(అక్రమంగా ఇంట్లోకి చొరబడడం), 427(అభ్యంతరకరంగా ప్రవర్తించడం), 506 (నేరాలకు పాల్పడినందున శిక్షించడం)లపై కేసులు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించిందని సంబంధిత పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఇదిలాఉండగా ఇద్దరు నైజీరియన్లు, ఇద్దరు ఉగాండాకు చెందిన యువతులు శనివారం చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వివేక్ గోలియాను కలిశారు. నగర రాజకీయాలకు తాము బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం తమపై దాడిచేసిన వారిని శిక్షించాలని, వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అభ్యర్థించారు. అయితే గోలియా వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ పోలీసులను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అక్కడి నుంచి విషయం కోర్టుకు రావడంతో ఆదివారం న్యాయమూర్తి.. దాడికి కారకులైనవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు.
నివేదిక ఇవ్వండి: ఎన్‌హెచ్‌ఆర్‌సీ
దక్షిణ ఢిల్లీలో నైజీరియా, ఉగాండా దేశీయులమీద గురువారం అర్ధరాత్రి దాడి జరిందన్న విషయాన్ని మీడియా కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఢిల్లీ ప్రభుత్వానికి, హోం మంత్రిత్వశాఖకు, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం... కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. నివేదిక ఇవ్వడానికి మూడు రోజులు గడువునిచ్చింది.
Advertisement